
రాయ్‌పూర్: సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని ఇండియా లెజెండ్స్ టీమ్ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. వెస్టిండీస్ లెజెండ్స్‌తో బుధవారం హోరాహోరీగా సాగిన సెమీఫైలన్లో 12 పరుగుల తేడాతో ఇండియా లెజెండ్స్ విజయం సాధించింది. ఈ హైస్కోరింగ్ పోరులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 218 రన్స్ చేసింది.
సచిన్ టెండూల్కర్ (42 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 65) మెరుపు హాఫ్ సెంచరీ చేయగా యువరాజ్ సింగ్(20 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్సర్లతో 49 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(17 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 35) మెరుపు ఆరంభమివ్వగా.. చివర్లో యూసఫ్ పఠాన్(20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్) చెలరేగాడు. వెస్టిండీస్ లెజెండ్స్ బౌలర్లలో టినో బెస్ట్ రెండు వికెట్లు తీయగా.. ర్యాన్ ఆస్టిన్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం ఛేజింగ్‌కు దిగిన వెస్టిండీస్ లెజెండ్స్ ఓవర్లన్నీ ఆడి 6 వికెట్లకు 206 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. డ్వేన్ స్మిత్(63), డియో నరైన్(59), కెప్టెన్ బ్రియాన్ లారా(46) చెలరేగినా లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. ఓ దశలో 18 ఓవర్లకు 194/3తో ఆ టీమ్ గెలుపు ముంగిట నిలిచింది.
కానీ చివరి రెండు ఓవర్లలో 3 వికెట్లు తీసిన వినయ్ కుమార్(2/26), ఇర్ఫాన్ పఠాన్(1/48) భారత్‌కు విజయాన్నందించారు. గురువారం జరగనున్న సెకండ్ సెమీఫైనల్లో శ్రీలంక లెజెండ్స్, సౌతాఫ్రికా లెజెండ్స్ తలపడనున్నాయి.