
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి ఆడేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని రాజస్థాన్ రాయల్స్ యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ తెలిపాడు. వరల్డ్ బెస్ట్ స్పిన్నర్ అయిన అశ్విన్‌తో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం గొప్ప విషయమని తెలిపాడు. అతని మెళకువలతో తన బౌలింగ్ మరింత మెరుగుపరుచుకుంటానని తెలిపాడు.
ప్రస్తుతం ముంబైలో ఉన్న రియాన్ పరాగ్.. ఐపీఎల్ 2022 సీజన్ కోసం సమాయత్తం అవుతున్నాడు. ఐపీఎల్ మెగా వేలంలో రూ.5 కోట్ల భారీ మొత్తానికి సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ని రాజస్థాన్ యాజమాన్యం కొలుగోలు చేసిన విషయం తెలిసిందే. రియాన్ పరాగ్‌ను కూడా రాజస్థాన్ మళ్లీ తీసుకోవడంతో ఈ ఇద్దరూ ఒకే జట్టుకు ఆడనున్నారు.
ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో అశ్విన్ గురించి రియాన్ పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ప్రపంచ క్రికెట్‌లో అశ్విన్ అత్యుత్తమ స్పిన్నర్. అలాంటి దిగ్గజ ఆటగాడితో కలిసి ఆడేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. అతని బౌలింగ్‌లోని వైవిధ్యాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తా. పలు సూచనలు కూడా తీసుకుంటాను. అశ్విన్‌తో కలిసి ఆడటం వల్ల ఈ సీజన్ తర్వాత నా బౌలింగ్ కచ్చితంగా మరింత మెరుగవుతుంది.
రాజస్థాన్ రాయల్స్ జట్టుతోనే నా ఐపీఎల్ ప్రయాణం మొదలైంది. ఇటీవల ముగిసిన మెగా వేలంలోనూ రాజస్థాన్ టీమ్‌మేనేజ్‌మెంట్ నాపై నమ్మకం ఉంచి మళ్లీ దక్కించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వేలంలో నాకోసం నాలుగు జట్లు బిడ్ వేశాయి. అది చాలా గొప్ప విషయం. అది చూసినప్పుడు నేను సరైన దారిలోనే వెళ్తున్నాననే నమ్మకం కలిగింది. ఇటీవల దేశవాళీ క్రికెట్లో మెరుగ్గా రాణించాను. బౌలింగ్‌లోనూ తొలిసారిగా ఐదు వికెట్ల ప్రదర్శన చేశాను.
క్రికెట్లో ఇంకా నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. ఐపీఎల్‌లో 6, 7 స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగి ఫినిషర్ పాత్ర పోషించడం చాలా కష్టం. ఇంతకు ముందు ఫినిషర్‌గా బరిలోకి దిగాలంటే కాస్త ఆందోళనగా ఉండేది. ఈ సీజన్‌లో గొప్పగా రాణించగలననే నమ్మకం ఉంది' అని రియాన్ పరాగ్ అన్నాడు. గత మూడేళ్లుగా రాజస్థాన్ జట్టు తరఫున ఆడుతున్న రియాన్.. 30 మ్యాచుల్లో 118.53 స్ట్రైక్ రేట్‌తో 339 పరుగులు చేశాడు.