స్పిన్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోకపోవడంతోనే గెలిచే మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని రాజస్థాన్ రాయల్స్ తాత్కలిక కెప్టెన్ రియాన్ పరాగ్ అన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో చిన్నస్వామి స్టేడియం వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 70), దేవదత్ పడిక్కల్(27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, వానిందు హసరంగా తలో వికెట్ తీసారు.

మలుపు తిప్పిన హజెల్ వుడ్
అనంతరం రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 194 పరుగులే చేసి ఓటమిపాలైంది. యశస్వి జైస్వాల్(19 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49), ధ్రువ్ జురెల్(34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 47) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆర్‌సీబీ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(4/33) నాలుగు వికెట్లతో రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించగా.. భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్ చెరో వికెట్ పడగొట్టారు. కృనాల్ పాండ్యాకు రెండు వికెట్లు దక్కాయి. 19వ ఓవర్‌లో హజెల్ వుడ్ మ్యాచ్‌ను ఆర్‌సీబీ వైపు మలుపు తిప్పాడు. క్రీజులో సెట్ అయిన ధ్రువ్ జురెల్‌తో పాటు వానిందు హసరంగాలను ఔట్ చేసి ఒకే ఒక్క పరుగు ఇచ్చాడు. దాంతో ఆర్‌సీబీకి విజయం దక్కింది.
వారి వల్లే ఓటమి..
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన రియాన్ పరాగ్.. ఆర్‌సీబీ స్పిన్నర్లు తమ విజయవకాశాలను దెబ్బతీసారని తెలిపాడు. 'మేం బంతితో అద్భుత ప్రదర్శన కనబర్చాం. ఇది 210-220 పరుగులు చేయాల్సిన వికెట్. సరైన సమయంలో పుంజుకొని.. ఆర్‌సీబీని తక్కువ పరుగులకే కట్టడి చేశాం. బ్యాటింగ్‌లోనూ సగం మ్యాచ్ ముగిసే వరకు మాకే విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ మరోసారి మిలార్డర్, లోయరార్డర్ బ్యాటర్ల వైఫల్యం జట్టు ఓటమిని శాసించింది.
స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయాం. వారిపై సరైన ఇంటెంట్ చూపించలేకపోయాం. స్వేచ్చగా.. దూకుడుగా ఆడాల్సిన బాధ్యత ఆటగాళ్లపై ఉంది. ఈ టోర్నీలో ఒక్క తప్పిదం చేసినా మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఈ రోజు అదే జరిగింది. ఇప్పటికే మా ప్రదర్శనపై సుదీర్ఘమైన చర్చలు జరిపాం. ఈ మ్యాచ్‌లాంటి పరిస్థితుల గురించి మాట్లాడుకున్నాం. కానీ మా వ్యూహాలను సరిగ్గా అమలు చేయలేకపోయాం. మేం గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకున్నాం. ఇక నుంచి మేం పరువు కోసం ఆడాల్సిందే. 'అని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు.