
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయం తీవ్రతను తెలుసుకునేందుకు టీమ్‌మేనేజ్‌మెంట్ వెంటనే పంత్‌ను స్కానింగ్‌కు పంపించింది. దాంతో అతని స్థానంలో వృద్దిమాన్ సాహా వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు. ఈ మ్యాచ్‌లో 36 పరగులు మాత్రమే చేసిన పంత్.. ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో గాయపడ్డాడు. 141 కిలోమీటర్ల వేగంతో అతను వేసిన బంతి నేరుగా పంత్ మోచేతికి బలంగా తాకింది.
బంతిని అంచనా వేయడంలో పంత్ విఫలమయ్యాడు.
ఇక నొప్పితో విలవిలలాడిన పంత్, ఫిజియో పర్యవేక్షణ తర్వాత బ్యాటింగ్ కొనసాగించాడు. కానీ మునపటి జోరును కనబర్చలేకపోయాడు. నొప్పితో బాధపడుతూ బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు. చివరకు హెజెల్ వుడ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే డాక్లర్ల సలహాతో పంత్‌ను స్కానింగ్‌కు తీసుకెళ్లారు. పంత్ గాయం తీవ్రమైతే మాత్రం అతను సిరీస్ నుంచి దూరం కావాల్సి ఉంటుంది. ఇక పంత్ వికెట్ అనంతరం భారత్ వరుసగా వికెట్లు కోల్పోయి 244 పరుగులకు కుప్పకూలింది. చివర్లో జడేజా పోరాడినా ఫలితం లేకపోయింది. దాంతో ఆసీస్‌కు 94 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా యువ ఓపెనర్ విల్ పుకోస్కీ(10) వికెట్ కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో పుకోస్కీ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 6 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆసీస్ వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. క్రీజులో వార్నర్(5), లబుషేన్(0) ఉన్నారు.