
హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం ఢిల్లీ డేర్‌డెవిల్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ బ్యాట్స్‌మెన్లలో రిషబ్ పంత్ (106: 59 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సులు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
ఈ క్రమంలో రిషబ్ పంత్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ (128 నాటౌట్; 63 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఒక భారత బ్యాట్స్‌మన్ అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన ఆటగాడిగా రిషబ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
ఈ క్రమంలోనే 2010లో మురళీ విజయ్(127) నెలకొల్పిన పరుగుల రికార్డును రిషబ్ పంత్ అధిగమించాడు. దీంతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన రికార్డును కూడా రిషబ్ పంత్ తన పేరిట అరుదైన రికార్డుని నెలకొల్పాడు.
గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై క్రిస్ గేల్(104 నాటౌట్; 2018 ఐపీఎల్ సీజన్లో) అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డును నెలకొల్పాడు. ఇప్పుడు ఈ రికార్డుని రిషబ్ పంత్ బద్దలు కొట్టాడు. అంతేకాదు పిన్నవయసులో ఐపీఎల్ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా రిషబ్ అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు.

రిషబ్ పంత్ 20 ఏళ్ల 218 రోజుల వయసులో ఐపీఎల్ సెంచరీ నమోదు చేయగా, 2009లో మనీష్ పాండే 19 ఏళ్ల 253 రోజుల వయసులో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఐపీఎల్‌లో సెంచరీ సాధించాడు. ఇక, ఒక జట్టు చేసిన స్కోరులో అత్యధిక పరుగుల శాతాన్ని నమోదు చేసిన రెండో ఆటగాడిగా రిషబ్ నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో రిషబ్ 68.44 శాతం పరుగులు సాధించగా, గతంలో బ్రెండన్ మెకల్లమ్ 71.17 శాతం పరుగులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ కెరీర్‌లో రిషబ్ పంత్‌కి ఇదే తొలి శతకం కాగా ఈ సీజన్‌లో నమోదైన మూడో సెంచరీ. టోర్నీ ఆరంభంలోనే క్రిస్‌గేల్ (పంజాబ్), షేన్ వాట్సన్ (చెన్నై) సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే.