మిడిలార్డర్ బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన రిషభ్ పంత్.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందన్నాడు.
'ఈ ఓటమి తీవ్రంగా నిరాశపరిచింది. మేం చేయాల్సిన మంచి పని ఏదైనా ఉందా? అంటే ఈ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోవడమే. 15-16 ఓవర్ల వరకు మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కానీ డెత్ ఓవర్లలో రాజస్థాన్ బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. తదుపరి మ్యాచ్‌లో మేం మెరుగైన ప్రదర్శన చేస్తామని ఆశిస్తున్నా.

స్లోగా ఆడటంతో..
డేవిడ్ వార్నర్-మిచెల్ మార్ష్ మాకు మంచి శుభారంభం అందించారు. మా బ్యాటర్లు వరుసగా ఔటవ్వడంతో వికెట్లు కాపాడుకోవాల్సి వచ్చింది. ఆచితూచి ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో చేధించాల్సిన లక్ష్యం పెరిగిపోయింది.
ఆఖరి ఓవర్‌ను అన్రిచ్ నోకియాతో బౌలింగ్ చేయించడం మా ప్రణాళిక. ఇతర ఆప్షన్స్ ఉన్నా.. అతనితో ఆ ఓవర్ వేయించాలనుకున్నాం. కొన్నిసార్లు పరుగులు వస్తుంటాయి. ఈ రోజు ఏది మాకు కలిసి రాలేదు.'అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.
రియాన్ పరాగ్ విధ్వంసం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసింది. రియాన్ పరాగ్(45 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 84 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 173 పరుగులే చేసి ఓటమిపాలైంది.
డేవిడ్ వార్నర్(34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49), ట్రిస్టన్ స్టబ్స్(23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44 నాటౌట్) రాణించినా ఫలితం లేకపోయింది. రాజస్థాన్ బౌలర్లలో చాహల్, బర్గర్ రెండు వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.
అన్రిచ్ నోకియా వేసిన ఆఖరి ఓవర్‌లో రియాన్ పరాగ్ వరుసగా 4, 4, 6, 4,6, 1తో 25 పరుగులు పిండుకున్నాడు. ఈ పరుగులే ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిని శాసించాయి.