ఆ ఇద్దరి వైఫల్యమే టీమిండియా కొంపముంచింది: రిషభ్ పంత్

పార్ల్: సౌతాఫ్రికా గడ్డపై అడుగు పెట్టే ముందు రెండు ఫార్మాట్స్‌లోనూ విజేతగా నిలిచేలా పటిష్టంగా కనిపించిన భారత జట్టు చివరకు పేలవ ప్రదర్శనతో రెండు సిరీస్‌లూ కోల్పోయింది. టెస్టు సిరీస్‌ను 1-2తో చేజార్చుకున్న టీమిండియా మ్యాచ్ మ్యాచ్‌కు మరింత చెత్త పెర్ఫామెన్స్ కనబర్చి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్‌నూ చేజార్చుకుంది. తొలి పోరుకు దాదాపు రీప్లేలా కనిపించిన రెండో వన్డేలోనూ రాహుల్ సేన సునాయాసంగా తలవంచింది.
పసలేని బ్యాటింగ్‌తో ముందుగా సాధారణ స్కోరుకే పరిమితం కాగా... ఆపై బౌలర్లు పూర్తిగా నిరాశపరిచారు. మరోవైపు సమష్టిగా చెలరేగిన సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్నందుకొని సిరీస్ కైవసం చేసుకుంది. అయితే స్పిన్నర్ల వైఫల్యమే తమ పతనాన్ని శాసించిందని టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ అన్నాడు.

అశ్విన్, చాహల్ వైఫల్యం..
మ్యాచ్ అనంతరం ఓటమిపై మీడియాతో మాట్లాడిన పంత్.. మెరుగైన పరుగులు చేసినా మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోయామన్నాడు. ‘మ్యాచ్ జరిగేకొద్దీ పిచ్ స్లోగా మారిపోయింది. మరోవైపు భారత్ జట్టు బోర్డుపై మెరుగైన స్కోరును ఉంచింది. కానీ.. మిడిల్ ఓవర్లలో సౌతాఫ్రికా వికెట్లను తీయడంలో బౌలర్లు విఫలమయ్యారు. మరీ ముఖ్యంగా.. స్పిన్నర్లు అశ్విన్, యుజ్వేంద్ర చాహల్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఇదే మ్యాచ్‌లో సౌతాఫ్రికా స్పిన్నర్లు చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో క్రమశిక్షణగా బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టారు. వారు పిచ్ నుంచి లభించిన సహకారాన్ని పూర్తిగా వినియోగించుకుని మిడిల్ ఓవర్లలో భారత్ వికెట్లు పడగొట్టారు'అని పంత్ చెప్పుకొచ్చాడు.

సఫారీ స్పిన్నర్లే..
సౌతాఫ్రికా జట్టులో స్పిన్నర్లు షంసీ రెండు వికెట్లు తీయగా.. కేవశ్ మహరాజ్, మర్‌క్రమ్ చెరో వికెట్ పడగొట్టారు. ఇందులో మర్‌క్రమ్ పార్ట్ టైమ్ స్పిన్నర్ కాగా.. మ్యాచ్‌లో అతని బౌలింగ్ ఎకానమీ 4.20గానే ఉండటం విశేషం. అలానే మహరాజ్ కూడా 9 ఓవర్లు వేసి 52 పరుగులు మాత్రమే ఇచ్చి.. విరాట్ కోహ్లీని డకౌట్ చేశాడు.
కానీ.. భారత టాప్ స్పిన్నర్ అశ్విన్ 10 ఓవర్లు వేసి ఏకంగా 68 పరుగులు సమర్పించుకుని.. ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. చాహల్ చివర్లో బవుమా వికెట్ పడగొట్టినా.. అప్పటికే మ్యాచ్ భారత్ నుంచి చేజారిపోయింది. ఓవరాల్‌గా.. పంత్ చెప్పినట్లు స్లో పిచ్‌పై సౌతాఫ్రికా స్పిన్నర్లతో పోలిస్తే.. భారత స్పిన్నర్లు తేలిపోయారు.

సౌతాఫ్రికా సునాయసంగా..
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (71 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 85), రాహుల్ (79 బంతుల్లో 4 ఫోర్లతో 55) అర్ధ సెంచరీలు చేశారు.
అనంతరం సౌతాఫ్రికా 48.1 ఓవర్లలో 3 వికెట్లకు 288 పరుగులు చేసి గెలిచింది. జేన్‌మన్ మలాన్ (108 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 91), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' డి కాక్ (66 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 78) తొలి వికెట్‌కు 132 పరుగులు జోడించారు. చివరి మ్యాచ్ ఆదివారం కేప్‌టౌన్ వేదికగా జరుగుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications