ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్ట్ నుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తప్పుకోవడం భావోద్వేగపూరితమైన నిర్ణయమని వికెట్ కీపర్ రిషభ్ పంత్ తెలిపాడు. ఇదో నిస్వార్థమైన పని అని, రోహిత్ నిఖార్సైన సారథని ప్రశంసించాడు. శుక్రవారం సిడ్నీ వేదికగా ప్రారంభమైన ఐదో టెస్ట్‌కు రోహిత్ శర్మ దూరంగా ఉండగా.. జస్‌ప్రీత్ బుమ్రా జట్టును నడిపిస్తున్నాడు. జట్టు ప్రయోజనాల కోసమే రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడని టాస్ సందర్భంగా బుమ్రా తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(98 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 40), రవీంద్ర జడేజా(95 బంతుల్లో 3 ఫోర్లతో 26) టాప్ స్కోరర్లుగా నిలిచారు.చివర్లో బుమ్రా(17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 22) విలువైన పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్బోలాండ్(4/31) నాలుగు వికెట్లతో చెలరేగగా.. మిచెల్ స్టార్క్(3/49) మూడు వికెట్లు పడగొట్టాడు. ప్యాట్ కమిన్స్(2/37) రెండు వికెట్లు దక్కాయి. నాథన్ లయన్ ఓ వికెట్ తీసాడు.

అనంతరం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ప్రారంభించగా.. ఉస్మాన్ ఖవాజా(2)ను బుమ్రా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది.
తొలి రోజు ఆట అనంతరం మీడియాతో మాట్లాడిన రిషభ్ పంత్‌ను రోహిత్ గైర్హాజరీ గురించి ప్రశ్నించగా తనదైన శైలిలో బదులిచ్చాడు. 'నాకు తెలిసి ఇది భావోద్వేగపూరితమైన నిర్ణయం. ఎందుకంటే సుదీర్ఘ కాలంగా రోహిత్ సారథిగా కొనసాగుతున్నాడు. మేమంతా అతన్ని టీమ్ నాయకుడిగానే చూస్తున్నాం. కానీ కొన్ని నిర్ణయాల్లోనే మనం భాగం కాలేం. ఇది మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయం. ఆ చర్చలో నేను భాగం అవ్వలేదు. కాబట్టి ఇంతకు మించి నేను ఏం చెప్పలేను.'అని రిషభ్ పంత్ పేర్కొన్నాడు.