ఐపీఎల్ 2024 సీజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమితో ప్రారంభించింది. పంజాబ్ కింగ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్.. ఇషాంత్ శర్మ గాయం తమ ఓటమిని శాసించిందని తెలిపాడు.
గాయంతో అతను మధ్యలోనే వైదొలగడం వల్ల తమకు ఓ బౌలర్ తక్కువయ్యాడని, అప్పటికే ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటర్‌ను ఉపయోగించడంతో తమకు బౌలింగ్ ఆప్షన్స్ లేకుండా పోయాయని చెప్పాడు. అయితే తమ ఓటమికి ఇదేమి సాకు కాదని, పంజాబ్ కింగ్స్ అద్భుతంగా ఆడిందని కొనియాడాడు. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టడంతో కాస్త ఆందోళనకు గురైనట్లు పంత్ చెప్పుకొచ్చాడు.

'ఇషాంత్ శర్మ గాయం మా విజయవకాశాలను దెబ్బ తీసింది. అప్పటికే మాకు ఓ బౌలర్ తక్కువగా ఉన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా అభిషేక్ పోరెల్‌ను దించడంతో ఎక్స్‌ట్రా బౌలర్ లేకుండా పోయాడు. కానీ అభిషేక్ పోరెల్ సూపర్ బ్యాటింగ్‌తో అదనపు పరుగులు అందించాడు. మ్యాచ్ అసాంతం మాకు ఓ బౌలర్ తక్కువయ్యాడు. అయినా మా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లారు.
నా రీఎంట్రీలో కాస్త నర్వస్‌గా ఫీలయ్యాను. మైదానంలో దిగగానే ఆందోళనకు గురయ్యాను. కానీ ఆ తర్వాత నా ఆటను ఆస్వాదించాను. ఈ ఓటమికి ఎలాంటి సాకులు లేవు. బౌలింగ్ ఆప్షన్స్ లేకుండా బరిలోకి దిగడం ఎప్పటికీ మంచిది కాదు. పంజాబ్ కింగ్స్ అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఇషాన్ పొరెల్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఇది ఆరంభం మాత్రమే. ఈ సీజన్‌లో అతను మరింత రాణిస్తాడు.'అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.
ఇషాంత్ శర్మ రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి ఓ వికెట్ తీసాడు. అతని కుడి చీలమండకు గాయం అవడంతో నొప్పితో మ్యాచ్ మధ్యలోనే తప్పుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగులు చేసింది. అభిషేక్ పోరెల్( 10 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 నాటౌట్), షై హోప్(25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33) టాప్ స్కోరర్లుగా నిలిచారు. డేవిడ్ వార్నర్(28), మిచెల్ మార్ష్(20), రిషభ్ పంత్(18), అక్షర్ పటేల్(21) పర్వాలేదనిపించారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ రెండేసి వికెట్లు తీయగా.. రబడా, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్ 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. సామ్ కరణ్(47 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 63) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. లియామ్ లివింగ్‌స్టోన్(21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 38) విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్ రెండేసి వికెట్లు తీయగా.. ఇషాంత్ శర్మ ఓ వికెట్ పడగొట్టాడు.