సెంచరీ చేయనందుకు కాదు.. మ్యాచ్ డ్రా అయినందుకు బాధపడ్డా: పంత్

చెన్నై: ఇటీవల ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో సెంచరీ చేజారడం కంటే.. మ్యాచ్‌ని టీమిండియా 'డ్రా'తో సరిపెట్టాల్సి వచ్చినందుకు తాను ఎక్కువగా బాధపడ్డా అని టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ తెలిపాడు. సిడ్నీ టెస్ట్ మ్యాచ్‌లో 407 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా.. రిషబ్ పంత్ (97: 118 బంతుల్లో 12x4, 3x6) దూకుడుగా ఆడటంతో ఒకానొక దశలో విజయం సాధించేలా కనిపించింది. అయితే జట్టు స్కోరు 250 వద్ద పంత్ ఔటవగా.. అనంతరం సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (39 నాటౌట్; 128 బంతుల్లో 7×4), హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ హనుమ విహారి (23 నాటౌట్; 161 బంతుల్లో 4×4) మ్యాచ్‌ని డ్రాగా ముగించారు.

మ్యాచ్ డ్రా అయినందుకు బాధపడ్డా
తాజాగా రిషభ్ పంత్ 'ది వీక్' పత్రికకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'సిడ్నీ టెస్టులో సెంచరీ చేజారినందుకు నేను బాధపడలేదు. కానీ మ్యాచ్‌ని డ్రాతో సరిపెట్టుకోవాల్సి రావడంతో ఎక్కువగా బాధపడ్డా. ఆ సమయంలో హార్ట్ బ్రేకింగ్‌గా అనిపించింది. నేను, చతేశ్వర్ పుజారా భాయ్ మ్యాచ్‌ని గెలిపించాలని చాలా ప్రయత్నించాం. కానీ అనుకోకుండా ఔట్ అయ్యా. ఆపై పరిస్థితులు మారాయి. సిడ్నీలో భారత్ గెలిచింటే బాగుండేది. ఔటయ్యే వరకూ నేను మ్యాచ్ గురించే తప్ప సెంచరీ గురించి ఆలోచించలేదు' అని తెలిపాడు.

గబ్బా టెస్టులో సాధారణ క్రికెట్ ఆడా
గబ్బా టెస్టులో రిషభ్ పంత్ (89; 138 బంతుల్లో 9x4, 1x6) కీలక ఇన్నింగ్స్ ఆడి భారత్‌కు చిరస్మరణీయ విజయం అందించాడు. చివరి రోజు మ్యాచ్ గెలవడానికి టీమిండియాకు 324 అవసరం కాగా.. ఓపెనర్ గిల్ (91) జట్టుకు అద్భుతమైన ఆరంభం ఇచ్చాడు. పుజారా ఇన్నింగ్స్‌ను నిర్మించగా.. పంత్ దూకుడుగా ఆడాడు. చివరలో సుందర్ కూడా రెచ్చిపోవడంతో భారత్ వరుసగా రెండోసారి ఆస్ట్రేలియా గడ్డపై 2-1 తేడాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. 'గబ్బా టెస్టులో గేమ్ ప్లాన్ ఏమీ లేదు. సాధారణ క్రికెట్ ఆడా. నేను గెలవడం గురించి పెద్దగా ఆలోచించలేదు కానీ అది నా మనసులో ఎదో మూల మాత్రం ఉంది. ఎక్కువ సమయం క్రీజులో ఉండాలనుకున్నా' అని పంత్ చెప్పాడు.

5 ఇన్నింగ్స్‌లలో 274 పరుగులు
రిషభ్ పంత్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. పింక్ బాల్ టెస్టులో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా విఫలమవడంతో రెండో టెస్ట్ నుంచి పంత్ ఆడాడు. 5 ఇన్నింగ్స్‌లలో 274 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 97. రెండో టెస్టులో మోస్తరుగా రాణించాడు. ఇక సిడ్నీ టెస్టులో భారీ లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాను తన దూకుడు బ్యాటింగ్‌తో విజయం వైపు నడిపించి ఔట్ అయ్యాడు. ఒకవేళ ఔటవ్వకుండా అలాగే బ్యాటింగ్ చేసి ఉంటే.. ఆ మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించే అవకాశం ఉండేది. ఇక గబ్బా టెస్టులో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందనుకున్న వేళ పుజారా (56), సుందర్ (22)తో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఈ నేపథ్యంలోనే చివర్లో మరింత దూకుడుగా ఆడిన పంత్ భారత్‌కు అపురూప విజయం అందించాడు.

ఇంగ్లండ్ సిరీస్ కోసం సన్నద్ధం
రిషభ్ పంత్ ప్రస్తుతం ఇంగ్లండ్ సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నాడు. చెన్నైలో శుక్రవారం తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. బయోబబుల్‌లో క్వారంటైన్ పూర్తి కావడం, కరోనా పరీక్షల్లో నెగెటివ్ రావడంతో ఇరు జట్ల ఆటగాళ్లు సన్నాహాలకు సిద్ధమయ్యారు. మంగళవారం నుంచి భారత్, ఇంగ్లిష్ జట్ల ఆటగాళ్లందరూ ప్రాక్టీస్‌కు దిగనున్నారు. సుదీర్ఘ పర్యటనలో భారత్-ఇంగ్లండ్ జట్లు వరుసగా నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
IPL 2021: తొలి క్రికెటర్‌గా ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు!!