అందుకే గెలిచాం: రిషభ్ పంత్

విశాఖపట్నం: ప్రణాళికలకు పకడ్బందీగా అమలు చేయడంతోనే సౌతాఫ్రికాతో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించామని టీమిండియా తాత్కలిక కెప్టెన్ రిషభ్ పంత్ అన్నాడు. తమ లక్ష్యంలో 15 పరుగులు తక్కువయ్యాయని భావించినా.. బౌలర్ల అద్భుత ప్రదర్శనతో విజయాన్నందుకున్నామని తెలిపాడు. మంగళవారం విశాఖపట్నం వేదికగా జరిగిన కీలక మూడో టీ20లో భారత్ సమష్టిగా రాణించి 48 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించింది. ఫలితంగా ఐదు టీ20ల సిరీస్‌లో 1-2తో నిలిచింది.
ఈ మ్యాచ్ అనంతరం విజయంపై స్పందించిన పంత్.. మిడిలార్డర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిందని, తదుపరి మ్యాచ్ వరకు మెరుగుపరుచుకుంటామని తెలిపాడు.

ప్రణాళికలకు తగ్గట్లు..
'ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేయడం చాలా ముఖ్యమని నేను ముందు నుంచి చెబుతున్నా. ఈ రోజు బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లో ప్రణాళికల ప్రకారం ఆడాం. అయితే మేం ఓ 15 పరుగులు వెనుకంజలో ఉన్నామనుకున్నాం. కానీ దాని గురించి ఎక్కువగా ఆందోళన చెందలేదు. బౌలర్లు మాత్రం అసాధారణ ప్రదర్శన కనబర్చారు. ముఖ్యంగా భారత్‌లో స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తారు.

స్పిన్నర్లు చెలరేగడంతో...
మిడిల్ ఓవర్లలో బ్యాటర్లను తమ స్పిన్‌తో ముప్పు తిప్పలు పెట్టి ఒత్తిడికి గురిచేస్తారు. కానీ గత రెండు మ్యాచ్‌ల్లో ఇది జరగలేదు. ఈ మ్యాచ్‌లో మాత్రం భారత స్పిన్నర్లు తమ సత్తా ఏంతో తెలియజేశారు. మిడిలార్డర్ బ్యాటర్లు తడబడ్డారు. అయితే గొప్ప ఆరంభం అందుకున్న తర్వాత క్రీజులోకి వచ్చి రాగానే భారీ షాట్లు ఆడటం ఏ బ్యాటర్‌కైనా కష్టం. తదుపరి మ్యాచ్ వరకు ఈ లోపాన్ని సరిచేసుకుంటాం'అని పంత్ చెప్పుకొచ్చాడు.

చెలరేగిన రుతురాజ్, ఇషాన్ కిషన్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57), ఇషాన్ కిషన్(35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు. సఫారీ బౌలర్లలో డ్వేన్ ప్రిటోరియస్ రెండు వికెట్లు తీయగా.. కగిసో రబడా, టబ్రైజ్ షంసీ, కేశవ్ మహరాజ్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సఫారీ టీమ్.. 19.1 ఓవర్లలో 131 పరుగులకు కుప్పకూలింది. హెన్రీచ్ క్లాసెన్(29), రీజా హెన్రీక్స్(23) టాప్ స్కోర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో హర్షల్ పటేల్(4/25) నాలుగు వికెట్లు తీయగా.. యుజ్వేంద్ర చాహల్(3/20) మూడు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్‌లకు తలో వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications