అందుకే ఓడాం: రిషభ్ పంత్

న్యూఢిల్లీ: టీ20 ఫార్మాట్‌లో ఏడు నెలలుగా ఒక్క ఓటమి లేకుండా దూసుకెళ్తున్న టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్ పడింది. వరుసగా 13వ విజయంతో వరల్డ్ రికార్డు కొట్టాలని ఆశించిన భారత్ జోరుకు సౌతాఫ్రికా కళ్లెం వేసింది. విధ్వంసకర బ్యాటింగ్‌తో ఏడు వికెట్ల తేడాతో సఫారీ జట్టు గెలుపొందింది. అయితే బ్యాటింగ్‌లో అదరగొట్టినా బౌలింగ్‌లో విఫలమయ్యామని టీమిండియా తాత్కలిక కెప్టెన్ రిషభ్ పంత్ అన్నాడు. రోహిత్ గైర్హాజరీలో సారథ్య బాధ్యతలు అందుకున్న కేఎల్ రాహుల్ చివరి నిమిషంలో దూరమవడంతో వైస్ కెప్టెన్ అయిన రిషభ్ పంత్ తాత్కలిక కెప్టెన్‌గా జట్టును నడిపించాడు. మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందించిన పంత్.. ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేయలేక మూల్యం చెల్లించుకున్నామని చెప్పాడు.

బౌలింగ్ వైఫల్యంతో...
'మేము మంచి స్కోరు నమోదు చేశాం. కానీ ఆ తర్వాత మా ప్రణాళికలను పక్కాగా అమలు చేయలేకపోయాం. అయితే, ఒక్కోసారి ప్రత్యర్థి జట్టుకు క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. మిల్లర్, వాన్‌డెర్ డసెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. నిజానికి మేము బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వికెట్ కాస్త నెమ్మదిగా ఉంది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో పరిస్థితి మారిపోయింది. డేవిడ్ మిల్లర్‌ను కట్టడి చేసేందుకు మేము బాగానే ప్రయత్నించాం. కానీ వికెట్ బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలించింది. ఏదేమైనా మా ప్రదర్శన పట్ల సంతృప్తిగానే ఉన్నాము. అయితే, తదుపరి మ్యాచ్‌లో కచ్చితంగా మెరుగ్గా రాణించాల్సి ఉంది'అని పంత్ చెప్పుకొచ్చాడు.

చెలరేగిన మిల్లర్..
మొదట భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (48 బంతుల్లో 76; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగగా... హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ రిషభ్ పంత్ (16 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.
అనంతరం దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి 212 పరుగులు చేసి గెలిచింది. వాన్‌డెర్ డసెన్ (46 బంతుల్లో 75 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' డేవిడ్ మిల్లర్ (31 బంతుల్లో 64 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) నాలుగో వికెట్‌కు 64 బంతుల్లోనే 131 పరుగులు జోడించి సిరీస్‌లో సఫారీకి శుభారంభం అందించారు.

దినేశ్ కార్తీక్ ఒక్కడే..
భారత్ తమ తొలి టి20 మ్యాచ్‌ను 2006లో ఆడింది. దక్షిణాఫ్రికాతో గురువారం జరిగిన తొలి టి20 మ్యాచ్ భారత్‌కు 160వది...నాటి తొలి మ్యాచ్‌లో టీమిండియా తరఫున ఆడిన దినేశ్ కార్తీక్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు. ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత కూడా అతను మళ్లీ భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం విశేషం. జూన్ 1న 37వ పుట్టిన రోజు జరుపుకున్న కార్తీక్ ఒక్కడే అప్పటి బ్యాచ్‌నుంచి ఇంకా రిటైర్ కాకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications