బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2021లో భాగంగా గబ్బా టెస్ట్‌లో తాను ఆడిన ఇన్నింగ్స్ గొప్పదని రోహిత్ శర్మ చెప్పాడని టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ అన్నాడు. ఆ సమయంలో రోహిత్ శర్మ మాటలు తనకు అర్థం కాలేదన్నాడు. విజయం కోసం ఆడిన ఇన్నింగ్స్ మాత్రమేనని తాను అనుకున్నానని, కానీ జనాలు ఆ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు రోహిత్ శర్మ మాటల అర్థం తెలిసిందన్నాడు.
అప్‌కమింగ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 కోసం టీమిండియా నవంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌తో రిషభ్ పంత్ మాట్లాడాడు. 2021-22 సిరీస్‌లో మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు.

దూకుడుగా ఉంటేనే..
'నేను ఒక్కో సిరీస్ గురించి ఆలోచిస్తాను. ఏడాదంతా ఆడుతూనే ఉంటాం కాబట్టి మా మదిలో ఎప్పుడూ క్రికెట్ ఉంటుంది. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి బౌన్స్ పిచ్‌లకు తగ్గట్లు ఆడాలి. షార్ట్ పిచ్ బాల్స్ ఆడటంపై ఫోకస్ పెట్టాలి. ఆస్ట్రేలియా జట్టు ప్రత్యర్థికి ఏ మాత్రం గెలుపు అవకాశం ఇవ్వదు. అయితే సొంత గడ్డపై ఆస్ట్రేలియా జట్టును ఓడించడం కంటే గొప్ప పని ఏది ఉండదు.
సాధారణంగానే ఆస్ట్రేలియా జట్టు సమష్టిగా పోరాడుతోంది. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వదు. దూకుడుగా క్రికెట్ ఆడుతారు. మైదానంలో నేను ఎవరినీ స్లెడ్జ్ చేయను. నన్ను స్లెడ్జ్ చేస్తే మాత్రం అస్సలు వదలను. ఆస్ట్రేలియాతో ఆడుతున్నప్పుడు ఇలాంటి మనస్తత్వమే కలిగి ఉండాలి.
రోహిత్ చెప్పినప్పుడు అర్థం కాలేదు..
గబ్బా ఇన్నింగ్స్ గురించి ఏం మాట్లాడాలో తెలియదు. నేను ఎప్పుడూ అత్యుత్తమంగా ఆడేందుకు ప్రయత్నిస్తాను. జీవితాంతం గుర్తు పెట్టుకునే కొన్ని ఇన్నింగ్స్‌లు ఉన్నాయి. అందులో గబ్బా టెస్ట్ ఒకటి. ఆ సమయంలో ఆ ఇన్నింగ్స్ ఎంత ముఖ్యమైనదో నాకు తెలియదు.
రోహిత్ భాయ్ వచ్చి 'నువ్వేం చేశావో నీకు తెలియదు'అన్నాడు. అందుకు నేనేం చేశాను. భారత విజయమే లక్ష్యంగా ఆడానని బదులిచ్చాను. ఇందుకు రోహిత్ భాయ్ స్పందిస్తూ.. 'నువ్వేం చేశావో తర్వాత అర్థమవుతుంది'అన్నాడు. కానీ, ఆ తర్వాత జనాలు గబ్బా ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకోవడం వింటే.. రోహిత్ అన్న మాటలకు అర్థం తెలిసింది.'అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.