లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో సోమవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో లక్నో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. సునాయసంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో రిషభ్ పంత్ చెత్త కెప్టెన్సీ లక్నో కొంపముంచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా బౌలింగ్ మార్పుల విషయంలో పంత్ ఘోర తప్పిదం చేశాడు.
అద్భుతంగా బౌలింగ్ చేసిన రవి బిష్ణోయ్‌ను సరిగ్గా వాడుకోలేకపోయాడు. చివరి నాలుగు ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి 44 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో ఉన్న శివమ్ దూబే జిడ్డు బ్యాటింగ్‌తో విసిగించాడు. దాంతో లక్నో విజయం ఖాయమనుకున్నారు. కానీ 17వ ఓవర్‌లో రవి బిష్ణోయ్‌తో కాకుండా శార్దూల్ ఠాకూర్‌తో వేయించి రిషభ్ పంత్ మూల్యం చెల్లించుకున్నాడు.

ఈ ఓవర్‌లో ధోనీ వరుసగా రెండు బౌండరీలు బాది మూమెంటమ్‌ను తమవైపు తిప్పుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందే డ్యూ కారణంగా రెండో బాల్ తీసుకొచ్చారు. ఆ సమయంలో స్పిన్నర్‌తో బౌలింగ్ చేయించి ఉంటే లక్నోకు ఫలితం దక్కేది. ఆ సమయంలో కామెంటేటర్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముంబై-ఢిల్లీ మ్యాచ్‌లో సెకండ్ బాల్ రాగానే కర్ణ్ శర్మతో బౌలింగ్ చేయించాలని రోహిత్ శర్మ సూచించాడు.
బంతిని అందుకున్న కర్ణ్ శర్మ వికెట్ తీసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. కానీ పంత్ మాత్రం శివమ్ దూబే.. స్పిన్నర్లపై అటాక్ చేస్తాడని భావించి పేసర్లకు బంతి ఇచ్చి మూల్యం చెల్లించుకున్నాడు. అప్పటి వరకు దూబే తీవ్రంగా తడబడ్డాడు. ఆ ఓవర్‌ను రవి బిష్ణోయ్‌తో వేసి ఉంటే కచ్చితంగా వికెట్ లభించేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో ధోనీ.. స్పిన్నర్ అయిన సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఔటయ్యాడని గుర్తు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ధోనీ పేస్ బౌలింగ్‌ను ఆడినట్లు స్పిన్ ఆడలేకపోతున్నాడని కామెంట్ చేస్తున్నారు.