
పార్ల్: టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్(71 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 85) అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో విధ్వంసకర హాఫ్ సెంచరీ బాదిన రిషభ్ పంత్.. సఫారీ గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత వికెట్ కీపర్‌గా గుర్తింపుపొందాడు. ఈ క్రమంలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డులను బద్దలు చేశాడు.
9 ఏళ్ల క్రితం (2013లో) మహేంద్ర సింగ్ ధోనీ సౌతాఫ్రికా గడ్డపై 65 పరుగులు చేయగా.. 21 ఏళ్ల క్రితం రాహుల్ ద్రవిడ్ వికెట్ కీపర్‌గా సఫారీ గడ్డపై 77 రన్స్ చేశాడు. ఇప్పటి వరకు భారత వికెట్ కీపర్లలో ఇవే టాప్ స్కోర్ల్‌గా ఉండగా.. తాజాగా పంత్ అధిగమించాడు. పంత్ ఇన్నింగ్స్‌కు ముందు సబా కరీమ్ 1997లో 55 పరుగులు చేశాడు.
64 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును రిషభ్ పంత్.. రాహుల్‌తో కలిసి ఆదుకున్నాడు. ఆరంభంలో కొంత తడబడినా.. ఆ తర్వాత తనదైన శైలిలో చెలరేగాడు. మహరాజ్ బౌలింగ్‌లో సిక్స్‌తో హిట్టింగ్ షురూ చేసిన పంత్.. షంసీ బౌలింగ్‌లో మూడు బౌండరీలతో చెలరేగాడు. అదే జోరులో పెహ్లుక్వాయో బౌలింగ్‌లో సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అనంతరం మరింత ధాటిగా ఆడిన పంత్.. షంసీ బౌలింగ్‌లో సింగిల్ హ్యాండ్‌తో లాంగాన్ మీదుగా సిక్సర్ బాదాడు. ఇది ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇక సునాయసంగా సెంచరీ సాధిస్తాడనుకున్న పంత్.. షంసీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. ఇక వన్డేల్లో పంత్‌కు ఇదే వ్యక్తిగత అత్యధిక స్కోర్ కావడం విశేషం.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు కేఎల్ రాహుల్(55), శిఖర్ ధావన్(29) శుభారంభాన్ని అందించారు. ఆరంభం నుంచే ధాటిగా ఆడటంతో పవర్ ప్లేలో టీమిండియా వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసి పటిష్ట స్థితిలో కనిపించింది. కానీ పవర్ ప్లే ముగిసిన వెంటనే టీమిండియా కథ మారింది. శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ(0) పరుగు వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. ఈ క్రమంలో రాహుల్, పంత్ 116 పరుగుల భాగస్వామ్యంతో టీమిండియాను ఆదుకున్నారు. హాఫ్ సెంచరీ అనంతరం మగలా బౌలింగ్‌లో రాహుల్ ఔటవ్వగా.. షంసీ బౌలింగ్‌లో పంత్ వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్(11) తీవ్రంగా నిరాశపరిచాడు. వెంకటేశ్ అయ్యర్‌తో పాటు శార్దూల్ ఠాకూర్ నిలకడగా ఆడుతున్నారు.