టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా మాంచెస్టర్ వేదికగా బుధవారం ప్రారంభమైన నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో రిషభ్ పంత్‌కు తీవ్ర గాయమైంది. క్రిస్ వోక్స్ వేసిన 68వ ఓవర్ ఓవర్ నాలుగో బంతి.. రిషభ్ పంత్ షూకు బలంగా తాకింది. ఈ బంతి ధాటికి పంత్ పాదం వాచిపోవడంతో పాటు రక్త స్రావం జరిగింది. బంతిని అంచనా వేయడంలో విఫలమైన పంత్.. బ్యాట్‌ను అడ్వాన్స్ ఊపాడు. దాంతో బంతి నేరుగా పాదం భాగంలో తాకింది.
నొప్పితో విలవిలలాడిన పంత్.. పాదాన్ని నేలపై పెట్టలేకపోయాడు. దాంతో గ్రౌండ్ అంబులెన్స్ సాయంతో పంత్‌ను మైదానం బయటకు తీసుకెళ్లారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. రిషభ్ పంత్ బయటకు వెళ్లడంతో జడేజా బ్యాటింగ్‌కు వచ్చాడు. రిషభ్ పంత్ గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అర్థమవుతోంది. అతని పాదం చిటికెన వేలి పక్క భాగం వాచిపోయి రక్త స్రావం జరిగింది. దాంతో అతను రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు.

అతను మళ్లీ తిరిగి బ్యాటింగ్ చేసే అవకాశాలు కనిపించడం లేదు. గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే రిషభ్ పంత్.. ఈ సిరీస్ మొత్తానికి దూరమవుతాడు. అది టీమిండియాకు తీరని నష్టంగా మారనుంది. మూడో టెస్ట్ సందర్భంగా రిషభ్ పంత్ చేతి వేలికి గాయమైన విషయం తెలిసిందే. ఆ గాయం నుంచి కోలుకునే లోపే మరోసారి తీవ్రంగా గాయపడ్డాడు. స్కానింగ్ రిపోర్ట్స్‌ను బట్టి రిషభ్ పంత్‌పై టీమిండియా మేనేజ్‌మెంట్ తుది నిర్ణయం తీసుకోనుంది.
ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్.. 83 ఓవర్లలో 4 వికెట్లకు 264 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(107 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 58), సాయి సుదర్శన్(151 బంతుల్లో 7 ఫోర్లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించగా.. కేఎల్ రాహుల్(98 బంతుల్లో 4 ఫోర్లతో 46), రిషభ్ పంత్(48 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 37) విలువైన పరుగులు చేశారు.
కెప్టెన్ శుభ్‌మన్ గిల్(12) విఫలమవ్వగా.. రవీంద్ర జడేజా(19 బ్యాటింగ్), శార్దూల్ ఠాకూర్(19 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ రెండు వికెట్లు తీయగా.. క్రిస్ ఓక్స్ ఓ వికెట్ తీసాడు. తీవ్రంగా గాయపడిన రిషభ్ పంత్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.