బౌలర్ల అసాధారణ ప్రదర్శనతోనే విజయం సాధించామని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ అన్నాడు. షమీ, ఆవేష్, దిగ్వేష్ రతి, సిద్దార్థ్ అసాధారణ బౌలింగ్ ప్రదర్శన కనబర్చారని కొనియాడాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన లక్నో 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. ఈ సీజన్‌లో లక్నోకు ఇదే తొలి విజయం. లో స్కోరింగ్ గేమ్‌లో రిషభ్ పంత్(50 బంతుల్లో 9 ఫోర్లతో 68 నాటౌట్) ఆఖరి వరకు క్రీజులో నిల్చోని విజయాన్ని అందించాడు.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రిషభ్ పంత్.. బౌలర్ల ప్రదర్శనను ప్రత్యేకంగా కొనియాడాడు.'ఈ విజయం పెద్ద ప్లస్ పాయింట్. చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను ముగించినప్పుడు జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది. మా బౌలర్లను ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే ముందుగా బౌలింగ్ చేసినప్పుడు మ్యాచ్‌పై పట్టునిచ్చింది వారే. షమీ భాయ్, ఆవేష్ ఖాన్, దిగ్గేష్ రతి అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా ఈరోజు జట్టులోకి వచ్చిన సిద్ధార్థ్ అదరగొట్టాడు. తను ఈ మ్యాచ్ ఆడాలని మేమంతా ముందే నిర్ణయించుకున్నాం. మా నమ్మకాన్ని అతను నిలబెట్టుకున్నాడు.

పర్ఫెక్ట్ మ్యాచ్ అనేది ఎప్పుడూ ఉండదు. మేనేజ్‌మెంట్‌గా మేం ఆటగాళ్ల ప్రదర్శనను నిశితంగా విశ్లేషించాలి. అదే సమయంలో మైదానంలో జరుగుతున్న సానుకూల అంశాలను అభినందించాలి. 'నేను ఇవన్నీ చేయగలను' అని అనుకోవడం కంటే, వ్యూహాన్ని సరిగ్గా అమలు చేయడంపైనే మేం దృష్టి పెడతాం. సన్నద్ధతపై నమ్మకం ఉంచి, ఆటపై పట్టు సాధించాలనేదే మా అసలు చర్చ.
ఈ లక్ష్యం పట్ల ఎలాంటి ఫిర్యాదులు లేవు. కానీ మేం గొప్ప ఆరంభాన్ని అందుకున్న నేపథ్యంలో ఇంకా మెరుగ్గా ఆడి ఉండాల్సింది. మేం ఎప్పుడూ విమర్శనాత్మకంగా ఉంటూనే.. ఒక జట్టుగా నేర్చుకుంటూ ప్రతి మ్యాచ్‌కూ మెరుగుపడాలని చూస్తున్నాం. నా బ్యాటింగ్ గురించి మాట్లాడాలంటే.. అంతా శుభంగా ముగిస్తేనే దేనికైనా విలువ ఉంటుంది. నేను వ్యక్తిగతంగా చాలా బాగా ప్రిపేర్ అవుతున్నాను.
నా 200% శ్రమను ధారపోస్తున్నాను. నా బ్యాట్‌తోనే సమాధానం చెప్పాలనుకుంటున్నాను. దాని గురించి ఎక్కువగా మాట్లాడటం ఇష్టం లేదు. నేను ఎంత కష్టపడుతున్నానో నా సహచర ఆటగాళ్లకు, మేనేజ్‌మెంట్‌కు తెలుసు.. నాకు అది ఒక్కటే ముఖ్యం.'అని రిషభ్ పంత్ పేర్కొన్నాడు.