టీమిండియా స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే న్యూజిలాండ్‌పై అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌తో ముంబై వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో రిషభ్ పంత్ 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రికార్డ్‌ను రిషభ్ పంత్ అధిగమించాడు.
ఇదే టెస్ట్ సిరీస్‌లో పుణె వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ 41 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. తాజాగా పంత్ 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసి అతన్ని అధిగమించాడు. పంత్ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లతో పాటు రెండు భారీ సిక్సర్లు ఉండటం విశేషం. అజాజ్ పటేల్ వేసిన 28వ ఓవర్‌లో క్రీజులో డ్యాన్స్ చేస్తూ బౌలర్ తలపై నుంచి బాదిన భారీ సిక్స్ ఈ ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది.

రిషభ్ పంత్‌కు తోడుగా శుభ్‌మన్ గిల్ కూడా హాఫ్ సెంచరీ సాధించడంతో టీమిండియా నిలకడగా ఆడుతోంది. 86/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా టీ బ్రేక్ సమయానికి 33 ఓవర్లలో 4 వికెట్లకు 163 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ 65 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే 45 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతని లైఫ్ లభించింది.
గ్లేన్ ఫిలిప్స్ వేసిన 27వ ఓవర్‌లో తొలి బంతిని భారీ సిక్సర్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవాలని శుభ్‌మన్ గిల్ భావించాడు. కానీ బ్యాట్‌కు సరిగ్గా తగలని బంతి గాల్లోకి లేచింది. ఈ హై క్యాచ్‌ను న్యూజిలాండ్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ చాప్‌మన్ నేలపాలు చేశాడు. దాంతో శుభ్‌మన్‌గిల్‌తో పాటు టీమిండియా ఊపిరి పీల్చుకుంది. మరోవైపు గ్లేన్ ఫిలిప్స్ నెత్తిని పట్టుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది. విల్ యంగ్(138 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 71), డారిల్ మిచెల్(129 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(5/65), వాషింగ్టన్ సుందర్(4/81) న్యూజిలాండ్ పతనాన్ని శాసించగా.. ఆకాశ్‌దీప్ ఓ వికెట్ తీసాడు.
RISHABH PANT - THE MAIN MAN OF DESTRUCTION...!!!! 🙇 pic.twitter.com/fJrJF9WavY
— Johns. (@CricCrazyJohns) November 2, 2024