టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‌ను సౌతాఫ్రికా జట్టు తృటిలో చేజార్చుకుంది. అసాధారణ ప్రదర్శనతో తొలిసారి ఫైనల్ చేరిన ఆ జట్టు.. ఒత్తిడికి చిత్తయ్యింది. శనివారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించింది. ఈ పరాజయంతో సౌతాఫ్రికా ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు.
ప్రపంచకప్ టైటిల్ తృటిలో చేజారడాన్ని జీర్ణించుకోలేకపోయారు. సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్, ఎయిడెన్ మిల్లర్, హెన్రీచ్ క్లాసెన్ కన్నీటి పర్యంతమయ్యారు. మిల్లర్ తన సతీమణిని హగ్ చేసుకోని తన బాధను వ్యక్తం చేయగా.. డికాక్ కూడా తన కుటుంబ సభ్యులతో ఆవేదనన పంచుకున్నాడు.

హెన్రీచ్ క్లాసెన్ సైతం కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. తీవ్ర బాధలో ఉన్న క్వింటన్ డికాక్, హెన్రీచ్ క్లాసెన్‌లను టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఓదార్చాడు. తన జోకులతో వారిని నవ్వించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 76) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. అక్షర్ పటేల్(31 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 47)కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్(2/23), అన్రిచ్ నోర్కియా(2/26) రెండేసి వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, కగిసో రబడా తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 165 పరుగులు చేసి ఓటమిపాలైంది. హెన్రీచ్ క్లాసెన్(27 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 52) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. క్వింటన్ డికాక్(31 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 39), ట్రిస్టన్ స్టబ్స్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా(3/20) మూడు వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా(2/18), అర్ష్‌దీప్ సింగ్(2/20) రెండేసి వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ ఓ వికెట్ తీసాడు.