రాజస్థాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. 14 ఏళ్ల వయసులోనే వరల్డ్ బిగ్గెస్ట్ క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేయడమే కాకుండా.. ఆడిన మూడో ఇన్నింగ్స్‌లోనే విధ్వంసకర శతకం నమోదు చేయడంతో అతని పేరు మారుమోగుతోంది. గుజరాత్ టైటాన్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లోనే శతకం బాది వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. సెంచరీ బాదిన అతి పిన్నవయస్కుడిగా నిలిచాడు.
ఈ కుర్రాడి ఆటను చూసి యావత్ క్రికెట్ ప్రపంచం నివ్వెరపోతుంది. దిగ్గజ క్రికెటర్లు, టీమిండియా స్టార్ ఆటగాళ్లతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఈ 14 ఏళ్ల కుర్రాడిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సచిన్ టెండూల్కర్, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌కు ఫిదా అయ్యారు. వాటే బ్యాటింగ్ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెట్టారు.

అయితే కొందరు అభిమానులు సోషల్ మీడియా వేదికగా కొత్త చర్చకు తెరలేపారు. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ ధరను ఇతర ఆటగాళ్లతో పోల్చుతూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో వైభవ్ సూర్యవంశీని రూ. కోటి 10 లక్షలకే రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. దాంతో కోటీ రూపాయలకే కోహినూర్ డైమండ్ వంటి ఆటగాడు రాజస్థాన్ రాయల్స్‌కు దొరికాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన రిషభ్ పంత్ కంటే వైభవ్ సూర్యవంశీ ఎంతో నయమని అభిప్రాయపడుతున్నారు. రిషభ్ పంత్‌కు సంజీవ్ గోయెంకా రూ. 27 కోట్లు అనవసరంగా ఖర్చు పెట్టాడని, రూ. 2 కోట్లు పెట్టి వైభవ్ సూర్యవంశీని తీసుకున్నా బాగుండేదని సెటైర్లు పేల్చుతున్నారు. ఈ చిచ్చర పిడుగుకు మంచి భవిష్యత్తు ఉందని, రాజస్థాన్ రాయల్స్ అతన్ని అస్సలు వదులుకోదని కామెంట్ చేస్తున్నారు. ఈ సీజన్‌లో ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరకపోయినా.. వైభవ్ రూపంలో వారికి సంతృప్తి లభించిందని అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటి వరకు మూడే మ్యాచ్‌లు ఆడిన వైభవ్ సూర్యవంశీ.. 50.33 సగటుతో 151 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉండగా.. స్ట్రైక్‌రేట్ 215.71 కావడం గమనార్హం. మరోవైపు రిషభ్ పంత్ 10 మ్యాచ్‌లు ఆడి 12.22 సగటుతో 110 పరుగులే చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉండగా.. స్ట్రైక్‌రేట్ 98.21 మాత్రమే.