నా వల్లే ఈ ఓటమి: రిషభ్ పంత్
చెత్త బ్యాటింగే తమ ఓటమికి ప్రధాన కారణమని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ అన్నాడు. తనతో పాటు బ్యాటర్లంతా విఫలమయ్యారని తెలిపాడు. బౌలర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చినా.. చెత్త బ్యాటింగ్‌తో గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 40 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. 160 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 119 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

చాలా కష్టంగా ఉంది..
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రిషభ్ పంత్.. ఈ ఓటమి గురించి మాట్లాడటం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. 'ఈ ఓటమి గురించి మాట్లాడటం కష్టంగా ఉంది. కచ్చితంగా మా చెత్త బ్యాటింగే ఓటమికి ప్రధాన కారణం. ఈ ఓటమి పట్ల జట్టుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నాం. అయితే మేం పుంజుకోవడానికి మార్గాలను వెతుక్కోవాలి. జట్టు లోపాలే పరిష్కారాలు కనుగొనాలి. ప్రస్తుతం మా పరిస్థితి బాలేదు.
బ్యాటింగ్ సమయంలో మేం కాస్త టైమ్ తీసుకొని ఆడాల్సింది. ఈ ఓటమికి నేను ఏ సాకు చెప్పదలచుకోలేదు. నాతో సహా మేమంతా ఆ తప్పు చేశాం. మ్యాచ్‌ను ఇంకాస్త చివరి వరకు తీసుకెళ్లాల్సింది. ఎందుకంటే మా బౌలర్లు ఈ రోజు అద్భుతంగా రాణించారు. బ్యాటింగ్ విభాగం బాధ్యత తీసుకొని బౌలర్ల కోసం ఈ మ్యాచ్ గెలవాల్సింది.
జట్టుగా ఈ ఓటమి మాకు నిరాశ కలిగిస్తుంది. కానీ మేం ఇంకా సానుకూల అంశాల వైపే చూడాలనుకుంటున్నాం. మా బలహీనతలను సరిదిద్దుకోవాలి. మా బౌలింగ్, బ్యాటింగ్‌లో ఫైర్ పవర్ ఉంది. మేం కచ్చితంగా పుంజుకుంటామని నమ్మకం నాకుంది.'అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.
ముగ్గురు డకౌట్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులే చేసింది. రవీంద్ర జడేజా(29 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 43 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో మహమ్మద్ షమీ(2/30), ప్రిన్స్ యాదవ్(2/29), మోహ్‌సిన్ ఖాన్(2/17) రెండేసి వికెట్లు తీసారు.
అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ 18 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ మార్ష్(41 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌తో 55) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. మిచెల్ మార్ష్‌తో పాటు నికోలస్ పూరన్(22), హిమ్మత్ సింగ్(15) మినహా అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆయుష్ బదోని(0), రిషభ్ పంత్(0), ఎయిడెన్ మార్క్‌రమ్(0) డకౌట్‌గా పెవిలియన్ చేరారు.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(3/20) మూడు వికెట్లు తీయగా.. నండ్రే బర్గర్(2/27), బ్రిజేష్ శర్మ(2/18) రెండేసి వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్‌లకు తలో వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications