ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో టీమిండియా హిట్టింగ్ సెన్సేషన్ రింకూ సింగ్ దుమ్మురేపుతున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ తనదైన బ్యాటింగ్‌తో శతకాల మోత మోగిస్తున్నాడు. ఈ దేశవాళీ టోర్నీలో ఉత్తరప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రింకూ సింగ్.. తమిళనాడుతో బుధవారం డ్రాగా ముగిసిన మ్యాచ్‌లో భారీ శతకంతో చెలరేగాడు.
247 బంతులాడిన రింకూ సింగ్ 17 ఫోర్లు, 6 సిక్స్‌లతో 176 పరుగుల భారీ స్కోర్ చేశాడు. తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. దాంతో ఈ మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 145.1 ఓవర్లలో 460 పరుగుల భారీ స్కోర్ చేసింది. 5 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తమిళనాడు ఆఖరి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 103 పరుగులు చేసింది.

ఫలితం తేలే పరిస్థితి లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. దాంతో నిర్ణీత సమయం కంటే ముందే ఈ మ్యాచ్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన తమిళనాడు 455 పరుగుల భారీ స్కోర్ చేసింది. బాబా ఇంద్రజిత్(149), ఆండ్రూ సిద్దార్థ్(121) సెంచరీలతో రాణించారు. రింకూ సింగ్ భారీ శతకంతోనే ఈ మ్యాచ్‌లో యూపీ ఓటమిని తప్పించుకుంది. ఆంధ్రతో జరిగిన తొలి రంజీ మ్యాచ్‌లోరూ రింకూ సింగ్ 165 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్ కూడా ఫలితం తేలకుండా డ్రాగానే ముగిసింది.
రింకూ సింగ్‌కు ఇది 9వ ఫస్ట్ క్లాస్ సెంచరీ. వరుసగా రెండో 150+ స్కోర్. 52 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 59.07 యావరేజ్‌తో రాణించిన రింకూ సింగ్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. తమిళనాడు, ఆంధ్ర స్పిన్నర్లను రింకూ సమర్థవంతంగా ఎదుర్కోవడంతో సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు రింకూ సింగ్‌ను తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో స్పిన్ బౌలింగ్ ఆడలేక టీమిండియా 30 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండో టెస్ట్‌కు రింకూ సింగ్‌ను తీసుకోని తుది జట్టులో అవకాశం ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. యూపీ తరఫున ఐదో స్థానంలో ఆడుతూ అద్భుతంగా రాణిస్తున్న రింకూ సింగ్‌ను టీమిండియాలో కూడా అదే స్థానంలో ఆడించాలని గంభీర్‌కు నెటిజన్లు సూచిస్తున్నారు. భారత టీ20 టీమ్‌లో భాగంగా ఉన్న రింకూ సింగ్.. తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు.