న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్‌తో వరల్డ్ క్లాస్ క్రికెటర్‌గా ఎదిగిన టీమిండియా యువ ప్లేయర్ రింకూ సింగ్.. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసేందుకు సిద్దమవుతున్నాడు. ఐర్లాండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టులో చోటు దక్కించుకున్న రింకూ సింగ్.. ఈ సిరీస్‌లో టీమిండియా క్యాప్ అందుకోనున్నాడు.
కడు పేదరికంలో పుట్టిన రింకూ సింగ్.. తనకు ఇష్టమైన ఆట కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. ఒకప్పుడు గ్యాస్ డెలివరీ బాయ్‌గా.. స్వీపర్‌గా కాలం వెళ్లదీసిన అతను ఇప్పుడు ఐపీఎల్ స్టార్‌గా కోట్లు ఆర్జిస్తున్నాడు.

కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా.. తన తండ్రి ఇంకా గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేస్తున్నాడని రింకూ సింగ్ తెలిపాడు. ఖాళీగా ఉండటం ఇష్టం లేక ఆయన తనకు వచ్చిన పని చేస్తున్నాడని తెలిపాడు.
ఐర్లాండ్ సిరీస్‌కు ఎంపికైన నేపథ్యంలో ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడిన రింకూ సింగ్.. తన తండ్రి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నాన్నను విశ్రాంతి తీసుకోమని చెప్పాను. కానీ ఆయన ఇప్పటికీ ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు వేసే పనిమానుకోలేదు.
ఆయనకు పని చేయడం ఇష్టం. ఒకవేళ ఇంట్లోనే కూర్చుంటే బోర్ కొడుతుందని అంటారు. చిన్న వయసు నుంచే కష్టం అలవాటైన వ్యక్తి కావడంతో ఖాళీగా ఉండలేకపోతున్నారు.'అని రింకూ సింగ్ చెప్పుకొచ్చాడు.
కేకేఆర్ అకాడమీతో రాటు దేలిన రింకూ సింగ్ ఆరంభ సీజన్లలో గాయాలతో ఇబ్బంది పడినా.. ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఒంటి చేత్తో విజయాలందించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో చివరి 5 బంతులకు 5 సిక్స్‌లు బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. మొత్తం 14 ఇన్నింగ్స్‌ల్లో 149.56 స్ట్రైక్‌రేట్‌తో 474 పరుగులు చేశాడు.