ఐపీఎల్ 2023 సీజన్‌లో రింకూ సింగ్ ఐదు బంతులకు ఐదు సిక్స్‌లు బాది అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన నాటి మ్యాచ్‌లో కేకేఆర్ తరఫున బరిలోకి దిగిన రింకూ సింగ్.. యశ్ దయాల్ వేసిన ఆఖరి ఓవర్‌లో ఈ ఫీట్ సాధించాడు. కేకేఆర్ విజయానికి 28 పరుగులు అవసరం కాగా.. రింకూ చివరి ఐదు బంతులకు ఐదు సిక్స్‌లు బాది సంచలన విజయాన్నందించాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో రింకూ సింగ్ యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ఈ ఐదు సిక్స్‌లు రింకూ సింగ్ జీవితాన్నే మార్చేసాయి. ఆ తర్వాత భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన రింకూ సింగ్.. టీమిండియా ఫినిషర్‌గా గుర్తింపు పొందాడు. ఆసియా కప్ 2025 కోసం ఎంపిక చేసిన భారత జట్టులోనూ అతనికి అవకాశం దక్కింది.
తన జీవితాన్ని మార్చిన ఆ ఐదు సిక్స్‌లు.. యూపీ ఎంపీ ప్రియ సరోజ్‌తో తన ప్రేమను కూడా నిలబెట్టాయని తాజాగా రింకూ సింగ్ వెల్లడించాడు. ఈ ఐదు సిక్స్‌లతో దేశవ్యాప్తంగా తనకు గుర్తింపు లభించిందని, అది తమ ప్రేమకు ఉపయోగపడిందని చెప్పాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రింకూ సింగ్ ఈ విషయాలను పంచుకున్నాడు. ఐదు సిక్స్‌లు బాదిన అనంతరం ప్రియా సరోజ్.. ఫోన్‌లో ఏడ్చిందని రింకూ సింగ్ తెలిపాడు.

'ఆ రోజు ప్రియ ఫోన్‌లో ఏడ్చేసింది. సాచి దీదీ(నితీష్ రాణా భార్య) ఆమె భావోద్వేగానికి లోనైందని నాకు చెప్పారు. అది నాకు చాలా ముఖ్యమైన రోజు. ఐదు బంతులకు ఐదు సిక్స్‌లు కొట్టడంతో నా పేరు ఈ దేశానికి తెలిసింది. అప్పుడే ప్రియా సరోజ్‌తో నా పెళ్లికి మార్గం సుగుమమైందని నేను భావించాను. ఎందుకంటే అప్పటి వరకు రింకూ సింగ్ ఎవరో ప్రియా సరోజ్ తండ్రికి తెలియదు. ఆయనకు క్రికెట్‌పై పెద్దగా ఆసక్తి లేదు. దాంతో నేను ఎవరో ఆయనకు తెలిసే అవకాశం లేదు.
ఆ ఐదు సిక్స్‌లు నా జీవితాన్ని మార్చేసింది. నా జీవితంలో నేను పడ్డ కష్టానికి ఆ మ్యాచ్‌లో ప్రతిఫలం దక్కింది. ఆ ఇన్నింగ్స్‌తోనే నాకు నా ఫాలోవర్స్ పెరిగారు. ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య రెట్టింపు అయ్యింది. దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఆ రాత్రి నుంచే నా జీవితం పూర్తిగా మారిపోయింది. పేరు, గుర్తింపు, ఫాలోవర్స్ అన్నీ ఆ రోజే ఆ దేవుడు నాకు ఇచ్చాడు.'అని రింకూ సింగ్ చెప్పుకొచ్చాడు.
సమాజ్‌వాద్ పార్టీ ఎంపీ అయిన ప్రియ సరోజ్‌తో రింకూ సింగ్‌కు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అతి త్వరలోనే ఈ ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటి అవ్వనున్నారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన రింకూ సింగ్‌తో రాజకీయ కుటుంబానికి చెందిన ప్రియ సరోజ్ ఎలా పరిచయమైందని, ఈ వివాహం ఎలా సెట్ అయ్యిందని అంతా ఆశ్చర్యపోయారు. పెద్దలు కుదిర్చిన వివాహమని చాలా మంది అనుకున్నారు. కానీ తాము సుదీర్ఘ కాలంగా ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యామని రింకూ సింగే స్వయంగా చెప్పాడు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అయిన పరిచయం, స్నేహంగా మారి.. ప్రేమగా చిగురించి.. వివాహ బంధానికి దారి తీసిందన్నాడు.
2024 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మచిలీషహర్ నుంచి ప్రియ సరోజ్ ఎంపీగా ఎన్నికైంది. బీజేపీ అభ్యర్థి బీపీ సరోజ్‌ను 35 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించింది. ఆర్డ్స్ న్యాయవాద విద్యలో ప్రియ సరోజ్ డిగ్రీ పూర్తి చేసింది. మరోవైపు రింకూ ఆసియా కప్ 2025 కోసం సిద్దమవుతున్నాడు.