టీమిండియా బిగ్ హిట్టర్, టీ20 సెన్సేషన్ రింకూ సింగ్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. సౌతాఫ్రికా పర్యటనలో రింకూ సింగ్ వరుసగా మూడు టీ20ల్లో విఫలమయ్యాడు. తొలి టీ20లో 11 పరుగులే చేసిన రింకూ సింగ్.. రెండో టీ20లో 9.. బుధవారం జరిగిన మూడో టీ20లో 8 పరుగులే చేశాడు.
సెంచూరియన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్ బ్యాటింగ్ చేసిన విధానం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. అలవోకగా బంతిని బౌండరీ బయటకు పంపించే రింకూ సింగ్.. ఫుల్ టాస్ ఆడేందుకు కూడా తడబడ్డాడు. బంతిని కనెక్ట్ చేయలేక సతమతమయ్యాడు. చివరకు యార్కర్ బంతిని ఆడలేక క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
రింకూ సింగ్ తన చివరి 7 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 91 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో రింకూ సింగ్‌కు ఏమైందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విధ్వంసకర బ్యాటింగ్‌తో మంచి ఫినిషర్‌గా గుర్తింపు పొందిన రింకూ సింగ్.. చిన్న ధోనీగా ప్రశంసలు అందుకున్నాడు. కానీ గత కొద్దీ రోజులుగా ఆ స్థాయిలో రాణించలేకపోతున్నాడు.

అయితే స్థిరంగా బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోవడం వల్లే రింకూ సింగ్ తడబడుతున్నాడని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. రింకూ సింగ్ సాధారణంగా ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్ చేస్తుంటాడు. కొన్నిసార్లు నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాడు. చివర్లో వచ్చి విలువైన పరుగులు చేయడమే రింకూ సింగ్ బాధ్యత. కానీ గత కొన్ని రోజులుగా రింకూ సింగ్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నాడు. వీలైనంత త్వరగా రింకూ సింగ్ ఫామ్ అందుకోవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.
ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 11 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో నాలుగు టీ20ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసింది. తిలక్ వర్మ (56 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 107) అజేయ శతకంతో చెలరేగగా.. అభిషేక్ శర్మ(25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ఆండిలే సిమలనె, కేశవ్ మహరాజ్ రెండేసి వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 208 పరుగులే చేసి ఓటమిపాలైంది. చివర్లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో మార్కో జాన్సెన్(17 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 54) పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. హెన్రీచ్ క్లాసెన్(22 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 41) ధాటిగా ఆడాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ రెండు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌కు తలో వికెట్ దక్కింది.