
కార్డిఫ్: ఇంగ్లండ్ చేతిలో ఎదురైన తొలి టీ20 పరాజయానికి 24 గంటల వ్యవధిలోనే సౌతాఫ్రికా రెండింతల ప్రతీకారం తీర్చుకుంది. గురువారం జరిగిన రెండో టీ20లో సమష్టిగా చెలరేగిన సఫారీ టీమ్ 58 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లు అండిలే పెహ్లుక్వాయో(3/39), టబ్రైజ్ షంసీ (3/27) తీన్మార్ వేయడంతో ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ బేజార్ అయింది. దాంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమమైంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్(15) విఫలమైనా.. మరో ఓపెనర్ రీజా హెండ్రీక్స్(32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 53), ఫస్ట్‌డౌన్ బ్యాటర్ రిలీ రాసౌ(55 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 96 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోర్డాన్, గ్లీసన్, మోయిన్ అలీ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 16.4 ఓవర్లలో 149 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. జాసన్ రాయ్(20), జోస్ బట్లర్(29), మోయిన్ అలీ (28), జానీ బెయిర్ స్టో (30), లియామ్ లివింగ్‌స్టోన్(18) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో పెహ్లుక్వాయో, షంసీ మూడేసి వికెట్లు తీయగా.. లుంగి ఎంగిడి రెండు వికెట్లు పడగొట్టాడు. కగిసో రబడా, కేశమ్ మహరాజ్ తలో వికెట్ తీసారు. అజేయ హాఫ్ సెంచరీతో రాణించి రిలీ రాసౌకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో టీ20 ఆదివారం జరగనుంది.
ఇక బుధవారమే జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ 41 పరుగులతో గెలుపొందిన విషయం తెలిసిందే. జానీ బెయిర్ స్టో(53 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 90) పరుగుల విధ్వంసానికి గ్లీసన్(3/51) తీన్మార్ తోడవడంతో సౌతాఫ్రికాకు పరాజయం తప్పలేదు. ఈ సిరీస్‌కు ముందు జరిగిన వన్డే సిరీస్‌లో తొలి వన్డేను సౌతాఫ్రికా 62 పరుగుల తేడాతో గెలవగా.. రెండో వన్డేలో ఇంగ్లండ్ 118 పరుగులతో విజయం సాధించింది. ఇక నిర్ణయాత్మక మూడో వన్డే వర్షంతో రద్దయింది. దాంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. ఈ టీ20 సిరీస్ అనంతరం సౌతాఫ్రికా ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్ ఆడనుండగా.. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో ఆగస్టు 17 నుంచి మూడు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది.