గిల్, రహానే ఆడినన్ని షాట్లు కూడా ఆడలేదు.. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌పై పాంటింగ్ ఫైర్!!

సిడ్నీ: టీమిండియాతో జరుగుతున్న టెస్టు సిరీసులో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రదర్శనపై ఆ దేశ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. భారత బౌలర్లకు గజ్జును వణుకుతున్నారని, వారిని ఎదుర్కొనేందుకు ఏమాత్రం తెగువ చూపడం లేదని ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన రికీ.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్ జట్టు మొత్తం కలిపి అజింక్య రహానే, శుభ్‌మన్ గిల్ ఆడినన్ని పుల్‌షాట్లు సైతం ఆడలేకపోయారని విమర్శించాడు. గులాబి టెస్టు ఓటమి అనంతరం బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత్ క్లీన్‌స్వీప్ అవుతుందని పాంటింగ్ చెప్పిన విషయం తెలిసిందే. బాక్సింగ్ డే టెస్టులో భారత్ విజయం సాధించడంతో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌పై పాంటింగ్ ఫైర్ అవుతున్నాడు.

ఆ పుల్‌షాట్లను లెక్క పెట్టగలను:
తాజాగా రికీ పాంటింగ్ మాట్లాడుతూ... ' రెండు టెస్టుల్లో ఎన్ని పుల్‌షాట్లు ఆడారో నేను లెక్క పెట్టగలను. ఎన్ని డ్రైవ్స్ ఆడారో మీరు చూశారా?. అక్కడ ఎక్కువగా షార్ట్ బంతులు, పుల్ బంతులు విసరలేదని మీరు చెప్పలేరు. ఎందుకంటే చాలినన్ని షార్ట్, ఫుల్ బంతులు భారత బౌలర్లు విసిరారు. ఈ రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా జట్టును మించి అజింక్య రహనే, శుభ్‌మన్ గిల్ మంచి పుల్‌షాట్లు ఆడారు. ఆసీస్ బౌలింగ్ దాడిని వారు సమర్థంగా ఎదుర్కొంటే.. టీమిండియా బౌలింగ్ దాడిని మాత్రం ఆసీస్ ఎదుర్కోలేకపోయింది. అంటే టీమిండియాది గొప్ప బౌలింగ్ అని చెప్పొచ్చు' అని పేర్కొన్నాడు.

ఈ పరుగులు ఏమాత్రం సరిపోవు:
అంతకుముందు రికీ మాట్లాడుతూ... 'అడిలైడ్‌లో ఆస్ట్రేలియా 191 పరుగులే చేసింది. మెల్‌బోర్న్ 195, 200 పరుగులకే పరిమితమైంది. ఇది టెస్టు క్రికెట్.. ఈ పరుగులు ఏమాత్రం సరిపోవు. అందులోనూ ఆ మాత్రం రన్స్ చేసేందుకు వారెంత సమయం తీసుకుంటున్నారనేదే కూడా బాధాకరం. ఆటగాళ్లు మరింత తీవ్రత చూపించాలి. ఔటవుతామనే భయాన్ని వీడాలి. క్రీజులోకి వెళ్లి బ్యాటుతో పరుగులు చేయాలి. ఓవర్‌కు రెండున్నర కన్నా ఎక్కువ పరుగులు చేయాలి. అడిలైడ్, మెల్‌బోర్న్‌లో ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఓవర్‌కు రెండున్నర పరుగుల చొప్పున చేశారు. ఓడిపోయిన గత సిరీసులోనూ అంతే. టెస్ట్ క్రికెట్‌లో లాంగ్ ఇన్నింగ్స్‌లో ఆడటం ముఖ్యం. ఓపిగ్గా బ్యాటింగ్ చేస్తూ పరుగులు రాబట్టాలి' అని అన్నాడు.

చాకచక్యంతో ఎదుర్కొన్నారు:
మెల్‌బోర్న్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 195 పరుగులకే ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ అజింక్య రహానే (112), శుభ్‌మన్ గిల్ (45), రవీంద్ర జడేజా (57) రాణించడంతో 326 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ మొహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా సమష్టిగా రాణించడంతో ఆసీస్ 200కే ఆలౌట్ అయింది. రహానే (27), గిల్ (35) సత్తాచాటడంతో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఆసీస్ బౌలర్లను ఈ ఇద్దరూ ఎంతో చాకచక్యంతో ఎదుర్కొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
స్టోక్స్‌కు సారీ చెప్పిన ఐసీసీ.. ఎందుకో తెలుసా?