World Cup 2023 Final: వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో టీమిండియాకు ఊహించని పరాజయం ఎదురైంది. టోర్నీ ఆసాంతం అదిరిపోయే ఆటతో ఎదురొచ్చిన ప్రత్యర్థిని మట్టికరిపించిన రోహిత్ సేన.. కీలక ఫైనల్లో మాత్రం తేలిపోయింది. ఆస్ట్రేలియాతో గత ఆదివారం జరిగిన ఫైనల్లో 6 వికెట్ల తేడాతో చిత్తయ్యి మరోసారి రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది.
ఈ మ్యాచ్‌లో గెలిచి 20 ఏళ్ల (2003 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమి) పగను తీర్చుకుంటుందని భావించిన అభిమానులకు.. మరో 20 ఏళ్ల పాటు వెంటాడే బాధను మిగిల్చింది. అసాధారణ ప్రదర్శనతో వరుసగా 10 విజయాలతో ఓట మెరుగని జట్టుగా ఫైనల్ చేరిన టీమిండియా టైటిల్ ముద్దాడటం ఖాయమని అంతా అనుకున్నారు.

కానీ పేలవ బ్యాటింగ్‌తో టీమిండియా చిత్తయ్యింది. అభిమానులు ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంత మరిచిపోదామని ప్రయత్నించినా.. వారి వల్ల కావడం లేదు. అయితే 140 కోట్ల భారతీయుల గుండె కోతకు ఫైనల్ మ్యాచ్ కోసం రూపొందించిన స్లో పిచ్ కారణమని దిగ్గజ ఆటగాళ్లు రికీ పాంటింగ్, మైకేల్ వాన్ అభిప్రాయపడ్డారు.
స్లో పిచ్‌ను రూపొందించడం, ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడంతో టీమిండియా ఒత్తిడికి గురైందని పాంటింగ్ తెలిపాడు. 'టీమిండియా చేసిన స్లో పిచ్ ప్లాన్ బెడిసి కొట్టింది. ఇది అసలు సిసలు ఉపఖండపు పిచ్.'అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

స్లో పిచ్‌కు తగ్గట్లు ఆస్ట్రేలియా చాలా తెలివిగా ఆడిందని మైకేల్ వాన్ అన్నాడు. 'వ్యూహాత్మకంగా ఆస్ట్రేలియా చాలా తెలివైన జట్టు. పిచ్ కండిషన్స్‌ను ఆసీస్ బాగా రీడ్ చేసింది. భారత్.. రెగ్యులర్ పిచ్ కాకుండా స్లో పిచ్ చేసి ఆస్ట్రేలియాకు అనుకూలం చేశారు.
మ్యాచ్‌కు ముందు కమిన్స్ చెప్పినట్లుగానే భారత అభిమానులను నిశబ్దంగా ఉంచాడు. 43 ఓవర్లలోనే లక్ష్యాన్ని అధిగమిస్తారని అస్సలు అనుకోలేదు.'అని వాన్ అన్నాడు. ఇక నాజర్ హుస్సేన్ మాత్రం పేస్ ఆల్‌రౌండర్ లేకపోవడం టీమిండియా కొంపముంచిందన్నాడు. భారత్ బౌలర్లకు బ్యాటింగ్ చేసే సామర్థ్యం లేకపోవడంతో కోహ్లీ, రాహుల్ భారీ షాట్లు ఆడలేకపోయారని, అదే టీమిండియా ఓటమికి కారణమైందన్నాడు.