పాకిస్థాన్‌కు టీ20 ప్రపంచకప్ గెలిచే సీన్ లేదు: రికీ పాంటింగ్

న్యూఢిల్లీ: అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్ గెలిచే సత్తా పాకిస్థాన్ జట్టుకు లేదని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ అన్నాడు. ఆ జట్టు పూర్తిగా కెప్టెన్ బాబర్ ఆజామ్‌పై ఆధారపడుతుందని, అతను రాణించకుంటే పాకిస్థాన్ విజయాలు సాధించలేదని చెప్పాడు. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 16 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. తాజాగా ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రికీ పాంటింగ్ అప్ కమింగ్ టీ20 ప్రపంచకప్ గురించి మాట్లాడాడు. భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ చేరుతాయని జోస్యం చెప్పాడు. టైటిల్ ఫైట్‌లో ఆస్ట్రేలియా విజయం సాధిస్తుందని అంచనా వేసాడు. అనంతర పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్ల గురించి కూడా మాట్లాడాడు.

పాక్ గెలవలేదు..
'మెగా టోర్నీలో బాబర్ ఆజామ్ సరిగ్గా రాణించకుంటే పాకిస్థాన్ గెలవలేదు. గత కొన్నేళ్లుగా బాబర్ ఆజామ్ బ్యాటింగ్‌ను నిశితంగా పరిశీలిస్తున్నా. టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చినప్పుడు సుదీర్ఘ ఫార్మాట్‌లో అతనికి తిరుగు లేదని చెప్పా. ఆకాశమే హద్దు అని సూచించా. అతను సైతం రోజు రోజుకి మరింత మెరుగవుతున్నాడు. ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ బాగా రాణిస్తున్నాడు. పాకిస్థాన్ ఓపెనర్లతో పాటు న్యూ బాల్ బౌలర్లు కీలకం. అయితే ఆస్ట్రేలియాలో స్పిన్నర్లకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. ఇక్కడి పిచ్‌లు వారికి ఏం మాత్రం సహకరించవు.'అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

ఆస్ట్రేలియాదే టైటిల్..
'ఈ సారి టీ20 ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియా పోటీ పడతాయని నేను అనుకుంటున్నా. అందులోనూ మా జట్టే విజయం సాధిస్తుందని భావిస్తున్నా. ఈ మెగా టోర్నీ మా సొంత గడ్డపైన జరగడమే అందుకు ప్రధాన కారణం అని విశ్వసిస్తున్నా. అయితే, గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ జరిగినప్పుడు ఆస్ట్రేలియా జట్టు విజేతగా నిలుస్తుందని అనుకోలేదు. అప్పుడు భారత టీ20 లీగ్ తర్వాత ప్రపంచకప్ జరగడంతో నాతో పాటు చాలా మంది అక్కడి పరిస్థితులు మా జట్టుకు కలిసివస్తాయని ఊహించలేదు. అయినా, మా ఆటగాళ్లు విజేతగా నిలవడానికి మార్గం కనుగొన్నారు' అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

ఇంగ్లండ్ సైతం..
అనంతరం ఇంగ్లండ్, జట్టుపై స్పందించిన పాంటింగ్.. ఆ జట్టు కూడా పోటీలో ఉంటుందన్నాడు. ఇంగ్లండ్‌కు పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడే లైనప్ బాగుందని. ఆ జట్టులోనూ మ్యాచ్ విన్నర్లు ఉన్నారన్నాడు. అయితే, ఏదేమైనా చివరికి ఆస్ట్రేలియానే కప్పు సాధిస్తుందని పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా అద్భుత ప్రదర్శనతో టైటిల్ ఎగరేసుకుపోయింది. టోర్నీలో హాఫ్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన భారత్ లీగ్ దశలోనే ఇంటి దారి పట్టగా పాకిస్థాన్.. సెమీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications