ఆసీస్‌కు ధోనీలాంటి ఆటగాడు లేడు.. అసలు కీపర్ ఎవరో అర్థం కావడం లేదు: రికీ పాంటింగ్

సిడ్నీ: ఆస్ట్రేలియా జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లున్నా.. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ లాంటి అద్భుత ఫినిషర్ లేడని ఆ జట్టు మాజీ సారథి రికీ పాంటింగ్ అన్నాడు. అలాంటి ఆటగాడి కోసం ఆస్ట్రేలియా ఎప్పుడూ ఆలోచించేదని తెలిపాడు. ఫినిషర్ స్థానం ఎంతో ప్రత్యేకమని, చివరి మూడు, నాలుగు ఓవర్లలో 50 పరుగులు చేయాలంటే అదే సరైన స్థానమని అభిప్రాయపడ్డాడు. అయితే ఆస్ట్రేలియా బిగ్ హిట్టర్స్ ఉన్నా.. వారంతా టాపార్డర్‌లోనే ఆడుతున్నారని తెలిపాడు. దాంతోనే జట్టుకు కావాల్సిన ఫినిషర్ దొరకడం లేదని చెప్పుకొచ్చాడు.

ధోనీ సూపర్ ఫినిషర్..
'ధోనీ కెరీర్ సాగినంత కాలం ఫినిషర్‌గానే ఆడాడు. ఆ స్థానంలో తనదైన ముద్ర వేశాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్ కూడా అలాంటి ఆటగాళ్లే. తమ దేశాలకు, లేదా ఐపీఎల్ జట్లకు నిలకడగా విజయాలు అందిస్తారు. వాళ్లిద్దరూ ఆయా స్థానాలకు పరిమితమయ్యారు. అయితే, ఆస్ట్రేలియా జట్టులో సరైన ఫినిషర్ లేకపోడానికి ప్రధాన కారణం.. అందులో బాగా ఆడే ఆటగాళ్లంతా బిగ్‌బాష్ లీగ్‌లో టాప్‌లోనే ఆడతారు.'అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

ఆసీస్‌కు ఫినిషర్ కావాలి..
ఆస్ట్రేలియా జట్టులో ఫినిషర్ స్థానంలో సరైన బ్యాట్స్‌మెన్ లేరని, అలాంటి ఆటగాడి కోసమే వెతకాల్సి ఉందని మాజీ కెప్టెన్ అభిప్రాయపడ్డాడు.'ప్రస్తుత పరిస్థితుల్లో గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ మార్ష్, మార్కస్ స్టోయినిస్‌లను మ్యాచ్ ఫినిషర్లుగా పరిగణించాల్సి ఉందా? కానీ ఆ ముగ్గురూ బిగ్‌బాష్‌లో టాప్‌ఆర్డర్‌లో ఆడతారు. వారిని లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయమని ఆయా జట్లను కోరడం కష్టం.'అని పాంటింగ్ తెలిపాడు.
ఐపీఎల్‌లో ఢిల్లీ జట్టుకు కోచ్‌గా ఉన్న పాంటింగ్.. స్టోయినిస్‌ను మ్యాచ్ ఫినిషర్‌గా చూడాలనుకున్నట్లు చెప్పాడు. ఈ క్రమంలోనే అతను పలు విజయాలు సాధించాడని గుర్తుచేశాడు. లోయర్ ఆర్డర్‌లో అలా ఆడిస్తేనే మంచి ఫినిషర్లుగా తయారవుతారని, కానీ.. వారిని ఇలా ఆడించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో తనకు తెలియదని పేర్కొన్నాడు.

వికెట్ కీపర్ ఎవరు?
'ఆస్ట్రేలియా జట్టుని చూస్తుంటే నాకు సూటిగా ఓ ప్రశ్న అడగాలనిపిస్తోంది. వికెట్ల వెనుక ఎవరు కీపర్‌గా ఉండబోతున్నారు..? ఇప్పుడు టీమ్‌లో ఉన్న ముగ్గురు వికెట్ కీపర్లని పరిశీలిస్తే.. మాథ్యూవెడ్ నెం.3లో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఫిలిఫ్పీ ఇప్పుడిప్పుడే మ్యాచ్‌లు ఆడుతున్నాడు. అలెక్స్ క్యారీ ఏ స్థానంలో బ్యాటింగ్ చేయగలడో క్లారిటీ లేదు. దాంతో.. ఈ ముగ్గురినీ జట్టులోకి తీసుకోవడం ద్వారా ఏ స్థానాల్ని భర్తీ చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు'' అని పాంటింగ్ పెదవి విరిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications