ఆసికప్ 2025 టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ ఫలితం కంటే.. షేక్ హ్యాండ్ వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో కనీస పోటీ ఇవ్వలేకపోయిన పాకిస్థాన్.. తమ చెత్తాటను విశ్లేషించుకోవాల్సింది పోయి భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదని గగ్గోలు పెడుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై ఐసీసీకి ఫిర్యాదు చేసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ).. భారత జట్టుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.
అంతేకాకుండా టాస్ సమయంలో భారత కెప్టెన్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వద్దని మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ తమ కెప్టెన్‌కు చెప్పాడని, అతన్ని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేసింది. లేకపోతే టోర్నీ నుంచి వైదొలుగుతామని కూడా హెచ్చరించింది. అయితే ఈ వివాదంలోకి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ను పాకిస్థాన్ నెటిజన్లు లాగారు. షేక్ హ్యాండ్ వివాదంలో భారత్‌ను తప్పుబట్టాడని సోషల్ మీడియా వేదికగా ఫేక్ ప్రచారానికి తెరలేపారు.

'పాకిస్థాన్‌పై సాంకేతికంగా భారత్ గెలిచినా.. క్రీడాస్ఫూర్తిని మరిచి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నైతిక ఓటమిని మూటగట్టుకుంది. ఓడినా.. పాక్ ఆటగాళ్లు నిఖార్చయిన యోధులు'అని రికీ పాంటింగ్ స్కై స్పోర్ట్స్‌తో అన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని రికీ పాంటింగ్ ఖండించాడు. ఆసియా కప్ 2025 గురించి తాను ఒక్క మాట కూడా మాట్లాడలేదని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశాడు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా తన పేరిట ప్రచారం అవుతున్న వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని పేర్కొన్నాడు.
'నేను అనని మాటలు అన్నట్లు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతున్నట్లు నా దృష్టికి వచ్చింది. నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు. నిజానికి ఆసియా కప్ టోర్నీ గురించి నేను ఎక్కడా మాట్లాడలేదు. అందరూ ఈ విషయాన్ని గమనించాలి.'అని రికీ పాంటింగ్ ట్వీట్ చేశాడు. స్కై స్పోర్ట్స్ కామెంట్రీ ప్యానెల్‌లో తాను లేనని కూడా స్పష్టం చేశాడు.
ఆసియా కప్ 2025 టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్-4కు అర్హత సాధించింది. మరోవైపు పాకిస్థాన్ భవితవ్యం యూఏఈపై ఆధారపడి ఉంది. బుధవారం యూఏఈతో పాక్ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టే గ్రూప్-ఏ నుంచి రెండో టీమ్‌గా సూపర్-4కు చేరుతుంది. ఒకవేళ పాక్ సూపర్ -4కు అర్హత సాధిస్తే.. ఆదివారం మరోసారి భారత్‌తో తలపడుతుంది.