దుబాయ్: ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌పై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. మ్యాచ్‌ను ఫినిష్ చేసే విషయంలో బెన్ స్టోక్స్‌ను టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పోల్చవచ్చని చెప్పాడు. అప్పుడు ధోనీ జట్టు విజయం కోసం క్రీజులో కడవరకు నిలిచేవాడని, ఇప్పుడు బెన్ స్టోక్స్ అదే చేస్తున్నాడని కొనియాడాడు.
ఒత్తిడి అధిగమించి ఆడటంలో ఈ ఇద్దరికి సాటిలేరని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో బెన్ స్టోక్స్ శతకంతో చెలరేగాడు. ఈ ఇన్నింగ్స్‌పై ఐసీసీ రివ్యూలో ప్రత్యేకంగా మాట్లాడిన రికీ పాంటింగ్ బెన్ స్టోక్స్ ఆట తీరును కొనియాడాడు.

'అంతర్జాతీయ క్రికెట్‌లో ఎవరైనా ఒత్తిడిలో ఆడగలరు. కానీ బెన్ స్టోక్స్‌లా మిడిలార్డర్ లేదా లోయరార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడటం ఆశమాషి వ్యవహారం కాదు. అప్పట్లో ధోనీ ఇలానే మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడేవాడు. తన ఆటతో ఎన్నో టీ20 మ్యాచ్‌ల్లో టీమ్‌ను ధోనీ గెలిపించాడు.
ఇప్పడు టెస్ట్‌ల్లో బెన్ స్టోక్స్.. ధోనీలా విజయాలు అందిస్తున్నాడు. క్రికెట్ చరిత్రలో ఈ ఇద్దరిలా మ్యాచ్‌లు ముగించిన ఆటగాళ్లు పెద్దగా లేరు. ముఖ్యంగా కెప్టెన్‌గా మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడినవారు ఒక్కరు కూడా లేరు. లార్డ్స్ టెస్ట్‌లో మరోసారి బెన్ స్టోక్స్ తన బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌ను గెలిపిస్తాడని అంతా అనుకున్నారు.
ఎందుకంటే గతంలో అతను గెలిపించిన దాఖలాలు ఉండటంతో మరోసారి రిపీట్ చేస్తాడని భావించారు. కానీ చేయాల్సిన లక్ష్యం ఎక్కువగా ఉండటంతో స్టోక్స్ విజయాన్ని అందించలేకపోయాడు. 2019లో హెడింగ్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ అసాధారణ ప్రదర్శనతో జట్టును గెలిపించాడు. అతనికి ఆ ఇన్నింగ్స్‌లో కొన్ని లైఫ్స్ కూడా లభించాయి.'అని పాంటింగ్ గుర్తు చేసుకున్నాడు.