
న్యూఢిల్లీ: మహిళల టీ20 ప్రపంచకప్‌లో సత్తా చాటిన అత్యుత్తమ ఆటగాళ్లతో ఐసీసీ అత్యంత విలువైన జట్టును ఎంపిక చేసింది. టోర్నీ అసాంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన ప్లేయర్లతో మోస్ట్ వాల్యుబుల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ పేరిట 12 మంది ఆటగాళ్ల ప్లేయర్లను వెల్లడించింది. ఈ జట్టులో భారత్ నుంచి వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ ఒక్కతే చోటు దక్కించుకుంది. ఈ టోర్నీలో రిచా ఘోష్ 130 స్ట్రైక్‌రేట్‌తో 136 పరుగులు చేసింది. పాకిస్థాన్, వెస్టిండీస్, ఇంగ్లండ్‌లపై రిచా(31 నాటౌట్, 44 నాటౌట్, 47 నాటౌట్) మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడింది.
వికెట్ కీపర్‌గా ఐదు క్యాచ్‌లు, రెండు స్టంపింగ్స్ చేసింది. ఈ మోస్ట్ వాల్యుబుల్ టీమ్‌కు ఇంగ్లండ్ ప్లేయర్ నాట్ సీవర్ బ్రంట్ కెప్టెన్‌గా ఎంపికవ్వడం విశేషం. ఈ జట్టులో ఛాంపియన్ టీమ్ అయిన ఆస్ట్రేలియాకు చెందిన నలుగురు ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. ఓపెనర్లుగా ఆస్ట్రేలియాకు చెందిన అలిస్సా హీలీతో పాటు సఫారీ ఓపెనర్ తజ్మీన్ బ్రిట్స్ ఎంపికైంది. తజ్మీన్ 37.20 సగటుతో 186 పరుగులు చేయగా.. అలిస్సా హిలీ 47.25 యావరేజ్‌తో 189 పరుగులు చేయడంతో పాటు కీపర్‌గా నాలుగు ఔట్లలో పాలుపంచుకుంది. మూడో స్థానంలో ఎంపికైన సౌతాఫ్రికా ప్లేయర్ లారా వాల్వర్ట్ 46 సగటుతో 230 పరుగులు చేయగా.. నాట్ సీవర్ 72 సగటుతో 216 రన్స్ చేసింది.

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఆష్లే గార్డనర్ 110 పరుగులతో పాటు 10 వికెట్లు పడగొట్టింది. సోఫీ ఎక్లిస్టోన్ 11 వికెట్లు తీయగా.. విండీస్ బౌలర్ కరిష్మ రామ్ హరక్ ఐదు వికెట్లు, సఫారీ బౌలర్ షబ్నిమ్ ఇస్మాయిల్ 7 వికెట్లు, ఆస్ట్రేలియా పేసర్ మేగన్ షట్ 10 వికెట్లు పడగొట్టింది. 12వ ప్లేయర్‌గా ఐర్లాండ్‌కు ఓర్లా ఫ్రెండర్ చోటు దక్కించుకుంది. ఆమె 27.25 సగటుతో 109 రన్స్ చేసింది.
ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో ఆస్ట్రేలియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 19 పరుగులతో గెలుపొందిన ఆసీస్ ఆరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. భారత జట్టు మరోసారి ఒత్తిడికి చిత్తయ్యి సెమీస్‌లోనే వెనుదిరిగింది. ఆసీస్ జరిగిన ఈ మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కెప్టెన్ హర్మన్‌కౌర్ రనౌట్ భారత జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది.