టీమిండియా వుమెన్స్ వికెట్ కీపర్ రిచా ఘోష్ చరిత్ర సృష్టించింది. మహిళల ఆసియా కప్ చరిత్రలోనే హాఫ్ సెంచరీ నమోదు చేసిన తొలి వికెట్ కీపర్ బ్యాటర్‌గా నిలిచింది. అంతేకాకుండా అంతర్జాతీయ టీ20ల్లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన అత్యంత చిన్న వయసు కలిగిన భారత వికెట్ కీపర్‌గా రికార్డ్ నమోదు చేసింది.
ఈ క్రమంలో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ రికార్డును అధిగమించింది. రిచా ఘోష్ 20 ఏళ్ల 297 రోజుల వయసులో టీ20 హాఫ్ సెంచరీ నమోదు చేయగా.. రిషభ్ పంత్ 21 ఏళ్ల 206 రోజుల వయసులో ఈ ఫీట్ సాధించాడు. 2019లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్ ఈ ఘనతను అందుకున్నాడు.

మహిళల ఆసియాకప్‌లో భాగంగా యూఏఈతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రిచా ఘోష్.. విధ్వంసకర హాఫ్ సెంచరీ నమోదు చేయడం ద్వారా ఈ ఘనతలను అందుకుంది. 29 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 64 పరుగులతో అజేయంగా నిలిచిన రిచా ఘోష్.. భారత జట్టుకు భారీ స్కోర్ అందించింది. భారత ఇన్నింగ్స్‌లో చివరి ఐదు బంతులను రిచా ఘోష్ వరుసగా బౌండరీలకు తరలించడం విశేషం.
రిచా ఘోష్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఈ మ్యాచ్‌లో టీమిండియా 78 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(47 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 66), వికెట్ కీపర్ రిచా ఘోష్(29 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 64 నాటౌట్) హాఫ్ సెంచరీలతో దుమ్మురేపారు. ఓపెనర్ షెఫాలీ వర్మ(18 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 37) మెరుపు ఆరంభం అందించింది. టీ20 క్రికెట్‌లో భారత మహిళల జట్టుకు ఇదే అత్యధిక స్కోర్.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన యూఏఈ 7 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసి ఓటమిపాలైంది. అమెరికా జట్టులో ఈషా రోహిత్ ఓజా(36 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 38), కవిషా(32 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 40 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు తీయగా.. రేణుకా సింగ్, తనుజా కన్వర్, పుజా వస్త్రాకర్, రాధా యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.