భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీలను ప్రస్తావిస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌తో తెలంగాణకు ఏ మాత్రం పోటీ లేదనే విషయాన్ని చెబుతూ క్రికెటర్ల పేర్లను ప్రస్తావించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సమయస్పూర్తితో రేవంత్ రెడ్డి చెప్పిన సమాధానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
అసలు విషయం ఏంటంటే..?
ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొని రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన పలు జాతీయ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పక్కరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గురించి జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి తనదైన శైలిలో బదులిచ్చారు. 'మీకు టీడీపీ పార్టీ, ఆ రాష్ట్రం గురించి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడి గురించి బాగా తెలుసు. పక్కరాష్ట్రమైన ఆంధ్రతో మీకు పోటీ ఉందని భావిస్తున్నారా?'అని సదరు జర్నలిస్ట్ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
వెంటనే రేవంత్ రెడ్డి.. 'మాకు ఎలాంటి పోటీ లేదు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్‌లు ఇద్దరూ క్రికెట్ దిగ్గజాలు. కానీ ఇది విరాట్ కోహ్లీ యుగం. కాలం మారింది. ఎలా ఆడాలో కోహ్లీ చూపిస్తాడు.'అని బదులిచ్చారు. ఇందుకు సంబంధించిన 21 సెకండ్ల వీడియో క్లిప్ నెట్టింట వైరల్‌గా మారింది. చంద్రబాబు నాయుడు దిగ్గజమని, తాను కోహ్లీలాంటి ఈ తరం పొలిటీషన్ అని రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పారు.
అయితే ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి అద్భుతమైన సమాధానమిచ్చారని కొందరంటే.. కోహ్లీ ఫామ్ గురించి తెలియకుండా మాట్లాడుతున్నారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. దేశంలో కాంగ్రెస్ పరిస్థితి కోహ్లీ ఫామ్‌లానే ఉందని సెటైర్లు పేల్చుతున్నారు. ఇంకొందరు మాత్రం రేవంత్ రెడ్డి కూడా కోహ్లీకి డైహార్డ్ ఫ్యాన్ కావచ్చని కామెంట్ చేస్తున్నారు.
Question - You understand the competition, the state and party, you know them very well. Are you feeling the competition?
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 23, 2025
Telangana CM Revanth Reddy - Sachin and Gavaskar are legends of the game, but it is the Virat Kohli era. He will show, how to play. pic.twitter.com/joWDiawKgi
Anchor : You understand the competition, the state and party, you know them very well. Are you feeling the competition?
— S P Y (@Kohli_Spy) January 23, 2025
Telangana CM Revanth reddy: Sachin & Gavaskar are legends of the game, but Now it is Virat Kohli https://t.co/mJlg6E4v11; He will show, how to play🔥 pic.twitter.com/UZBrcSMlfA