వెస్టిండీస్ ఆల్‌రౌండర్లు రొమారియో షెపెర్డ్, జాసన్ హోల్డర్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. ఇంగ్లండ్‌తో ఆదివారం జరిగిన రెండో టీ20లో ఒకే ఓవర్‌లో ఐదు సిక్స్‌లు బాదారు. ఈ ఇద్దరి విధ్వంసానికి ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్.. ఒకే ఓవర్‌లో 31 పరుగులు సమర్పించుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. రొమారియో షెపెర్డ్ హిట్టింగ్‌కు ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆర్‌సీబీకి ఆడిన రొమారియో షెపెర్డ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రొమారియో షెపెర్డ్ 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి సంచలన విజయాన్నందించాడు. అదే జోరును ఇంగ్లండ్ గడ్డపై కొనసాగిస్తున్నాడు. ఆదిల్ రషీద్ వేసిన 19వ ఓవర్‌లో తొలి మూడు బంతుల్లో జాసన్ హోల్డర్ హ్యాట్రిక్ సిక్స్‌లు బాదాడు. ఆ తర్వాత సింగిల్ తీసి రొమారియో షెపర్డ్‌కు స్ట్రైక్ ఇవ్వగా.. అతను చివరి రెండు బంతులను సిక్స్‌లుగా మలిచాడు.

అయినా ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌కు ఓటమి తప్పలేదు. రొమారియో షెపెర్డ్(11 బంతుల్లో 2 సిక్స్‌లతో 19), జాసన్ హోల్డర్(9 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 29 నాటౌట్) దూకుడైన బ్యాటింగ్‌తో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసింది. జాన్సన్ చార్లెస్(39 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 47), షై హోప్(38 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 49) టాప్ స్కోరర్లుగా నిలిచారు. రోవ్‌మన్ పోవెల్(15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34) పర్వాలేదనిపించాడు.ఇంగ్లండ్ బౌలర్లలో లూక్ వుడ్(2/25) రెండు వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్, జాకోబ్ బెతెల్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీసారు.
అనంతరం ఇంగ్లండ్ 18.3 ఓవర్లలో 6 వికెట్లకు 199 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. జోస్ బట్లర్(36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47) టాప్ స్కోరర్‌గా నిలవగా.. బెన్ డక్కెట్(18 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 30), హ్యారీ బ్రూక్(20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34), టామ్ బాంటన్(11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30 నాటౌట్) రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో అకీల్ హోస్సేన్, జాసన్ హోల్డర్, రొమారియో షెపెర్డ్, రోస్టన్ ఛేజ్ తలో వికెట్ తీయగా.. అల్జారీ జోసెఫ్(2/45) రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ గెలుపుతో ఇంగ్లండ్ మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను ఇంగ్లండ్ 3-0తో కైవసం చేసుకుంది.