టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేయడం తన కల అని జమ్ము కశ్మీర్ యువ పేసర్ రసిఖ్ సలామ్ దార్ అన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కి ఎంపికవ్వడంతో ఆ కల సాకారమయ్యే సమయం ఆసన్నమైందని సంతోషం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రసిఖ్ సలామ్‌ను ఆర్‌సీబీ రూ. 6 కోట్ల భారీ దరకు కొనుగోలు చేసింది. దాంతో ఐపీఎల్ 2025 మెగావేలంలోనే అత్యధిక ధర పలికిన అనామక ఆటగాడిగా రసిస్ సలామ్ నిలిచాడు.
తాజాగా Mykhel వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రసిఖ్ సలామ్ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'అందిరిలానే నేను గల్లీ క్రికెట్‌తోనే నా ఆటను మొదలుపెట్టాను. ముందుగా టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడాను. అయితే ఐపీఎల్ ఆడుతానని కలలో కూడా ఊహించలేదు. 2019 నా అచ్చొచ్చిన ఏడాది. ఆ ఏడాదే నా కెరీర్‌కు బ్రేక్ త్రూ లభించింది. జమ్ముకశ్మీర్ జట్టు తరఫున ఆడే అవకాశం దక్కింది. అదే ఏడాది ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాను. 2019ని నేను ఏ మాత్రం మరిచిపోలేను.

ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మా జట్టు ప్రదర్శన అద్భుతంగా సాగుతోంది. మా అత్యుత్త ప్రదర్శన కనబరుస్తున్నాం. జమ్ముకశ్మీర్ జట్టు గత కొన్నేళ్లుగా నిలకడగా ఆడుతోంది. మూడు ఫార్మాట్లలో మెరుగైన ప్రదర్శన చేస్తోంది. రంజీ ట్రోఫీ తొలి దశ ముగిసే సరికి మా ఎలైట్ గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచాం.
ఆర్‌సీబీ ఎంపికవ్వడం సంతోషంగా ఉంది. అది గొప్ప జట్టు. నాకు ఆర్‌సీబీ అంటే చాలా ఇష్టం. మరి ముఖ్యంగా విరాట్ భయ్యా అంటే చాలా ఇష్టం. నేను డబ్బులు చూడటం లేదు. అత్యధిక ధర పలికిన అనమాక ఆటగాడిననే ట్యాగ్‌ను పట్టించుకోవడం లేదు. నా జట్టు తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలనుకుంటున్నా. ఆర్‌సీబీని గెలిపించాలనుకుంటున్నా. అదే నా ప్రధాన లక్ష్యం.
విరాట్ కోహ్లీతో కలిసి ఆడటం నా కల. ఆ కల సాకారమయ్యే అవకాశం దక్కింది. అతనితో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకునే అవకాశం దక్కడం గొప్ప విషయం. విరాట్ భయ్యా ఫిట్‌నెస్, మైండ్‌సెట్‌తో పాటు ప్రతీ విషయంలోనూ మెరుగ్గా ఉంటాడు. అతనితో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకునే అవకాశం దక్కడం నాకు గొప్ప అనుభవం. అతని కోసమైనా జట్టును గెలిపించేందుకు ప్రయత్నిస్తాను.
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున తొలి రెండు మ్యాచ్‌లు సరిగ్గా ఆడలేదు. కానీ టీమ్‌మేనేజ్‌మెంట్ అండగా నిలిచింది. ఎవరైనా మనల్ని నమ్మి ప్రోత్సహిస్తే.. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతోంది. డెత్ ఓవర్స్, పవర్ ప్లే బౌలింగ్ కోసం నేను బాగా సాధన చేశాను. అందుకే మెరుగ్గా రాణిస్తున్నాను.
భారత జట్టుకు మూడు ఫార్మాట్లలో ఆడటమే నా జీవిత లక్ష్యం. అందుకోసం కష్టపడుతూనే ఉంటాను. దిగ్గజ పేసర్లు అయిన డేల్ స్టేయిన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీలతో కలిసి పనిచేయనుండటం సంతోషంగా ఉంది. భువనేశ్వర్ కుమార్ అంటే నాకు చాలా ఇష్టం. అతనిలానే నా బౌలింగ్ ఉంటుంది. అతని నుంచి సూచనలు, సలహాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తాను.'అని రసిఖ్ సలామ్ చెప్పుకొచ్చాడు.