ఐపీఎల్ 2026 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) శుభారంభం చేసింది. శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసింది. బౌలింగ్‌లో జాకోబ్ డఫీ మూడు వికెట్లతో చెలరేగితే.. బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.
అయితే ఆర్‌సీబీ విజయానికి ప్రధాన కారణం మాత్రం ఫిల్ సాల్ట్. 'క్యాచెస్ విన్ మ్యాచెస్'అనే క్రికెట్ నానుడీని నిజం చేశాడు. ఫిల్ సాల్ట్(8) బ్యాటింగ్‌లో విఫలమైనా.. స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో ఆర్‌సీబీ విజయానికి బాటలు వేసాడు. మూడు కీలక క్యాచ్‌లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించాడు. డేంజరస్ ట్రావిస్ హెడ్‌తో పాటు హెన్రీచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్ క్యాచ్‌లను సాల్ట్ అందుకున్నాడు.

ముఖ్యంగా హెన్రీచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్ క్యాచ్‌లు మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచాయి. 97 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన క్లాసెన్-ఇషాన్ కిషన్ జోడీని సాల్ట్ సన్నింగ్ క్యాచ్‌తో విడదీసాడు. రొమారియో షెఫెర్డ్ వేసిన 14వ ఓవర్‌లో క్లాసెన్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను బౌండరీ లైన్‌పై సాల్ట్ అద్భుతంగా అందుకున్నాడు. క్యాచ్ అందుకున్న తర్వాత బౌండరీ లైన్‌కు తగలకుండా తన శరీరాన్ని సమన్వయపరుచుకున్న తీరు అద్భుతం.. అమోఘం.
క్లాసెన్ ఔటైనా.. తనదైన విధ్వంసంతో సెంచరీ దిశగా సాగిన ఇషాన్ కిషన్‌ను కూడా ఫిల్ సాల్టే అసాధారణ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. సింగిల్ హ్యాండ్ సూపర్ మ్యాన్‌లా సాల్ట్ పట్టిన ఈ క్యాచ్ మ్యాచ్‌తో పాటు ఈ టోర్నీకే హైలైట్‌గా నిలవనుంది. ఈ రెండు కష్టతరమైన క్యాచ్‌లను సాల్ట్ పట్టకుంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ 30-50 పరుగులు అదనంగా చేసేది. అప్పుడే ఫలితం కూడా భిన్నంగా ఉండేది. ఈ క్రమంలోనే సాల్ట్ క్యాచ్‌లే మ్యాచ్‌ను మలుపు తిప్పాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 201 పరుగులు చేసింది. అనంతరం ఆర్‌సీబీ 15.4 ఓవర్లలో 4 వికెట్లకు 203 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. దేవదత్ పడిక్కల్(26 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61), విరాట్ కోహ్లీ(38 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 69 నాటౌట్) హాఫ్ సెంచరీలతో విజయంలో కీలక పాత్ర పోషించారు.