ఐపీఎల్ 2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) పరాజయాల పరంపర కొనసాగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం జరిగిన హైస్కోరింగ్ గేమ్‌లో ఆర్‌సీబీ 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇది సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు నాలుగో విజయం కాగా.. ఆర్‌సీబీకి ఆరో పరాజయం.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 287 పరుగుల భారీ స్కోర్ చేసింది. ట్రావిస్ హెడ్(41 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో 102) సెంచరీతో చెలరేగగా.. హెన్రీచ్ క్లాసెన్(31 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 67), ఎయిడెన్ మార్క్‌రమ్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 నాటౌట్), అబ్దుల్ సమద్(10 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్) మెరుపులు మెరిపించారు.

ఆర్‌సీబీ బౌలర్లలో లూకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు తీయగా.. రీస్ టోప్లీ ఓ వికెట్ పడగొట్టాడు. ఇదే సీజన్‌లో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 277/3 పరుగుల రికార్డ్ నమోదు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. తాజా మ్యాచ్‌తో ఆ ఘనతను అధిగమించింది.

దినేశ్ కార్తీక్ ఒంటరి పోరాటం..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 262 పరుగులే చేసి ఓటమిపాలైంది. దినేశ్ కార్తీక్(35 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 83), ఫాఫ్ డుప్లెసిస్(28 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 62)హాఫ్ సెంచరీలతో చెలరేగినా ఫలితం లేకపోయింది. విరాట్ కోహ్లీ(20 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42) సైతం మెరుపులు మెరిపించాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్(3/43) మూడు వికెట్లు తీయగా.. మయాంక్ మార్కండే(2/46) రెండు వికెట్లు తీసాడు. నటరాజన్‌కు ఓ వికెట్ దక్కింది.

కొంపముంచిన నోబాల్..
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ సందర్భంగా యశ్ దయాల్ చేసిన తప్పిదం ఆర్‌సీబీ కొంపముంచింది. 18 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అబ్దుల్ సమద్ క్యాచ్ ఇచ్చాడు. కానీ ఈ బంతి నోబాల్ కావడంతో అతను ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ అవకాశంతో చెలరేగిన అతను మార్క్‌రమ్‌తో కలిసి 57 పరుగులు జోడించాడు.
ఇది లీగల్ డెలివరీ అయ్యుంటే అబ్దుల్ సమద్ ఔటయ్యేవాడు. అప్పుడు సన్‌రైజర్స్ 260 పరుగులకు పరిమితమయ్యేది. అదే జరిగి ఉంటే ఆర్‌సీబీ గెలవడానికి ఆస్కారం ఉండేది.
అదిరిపోయే ఆరంభం..
288 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీకి ఓపెనర్లు కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. భారీ షాట్లతో సన్‌రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించిన అనంతరం కోహ్లీని మయాంక్ మార్కండే ఔట్ చేయగా.. క్రీజులోకి వచ్చిన విల్ జాక్స్ దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు.
రజత్ పటీదార్(9), సౌరవ్ చౌహన్(0 దారుణంగా విఫలమవ్వగా.. దినేశ్ కార్తీక్ చెలరేగాడు. మహిపాల్ లోమ్రోర్(19), అనూజ్ రావత్(8) సాయంతో ధాటిగా ఆడిన అతను 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం భారీ షాట్లతో చెలరేగిన దినేశ్ కార్తీక్.. జట్టును లక్ష్యానికి దగ్గరగా తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ అతన్ని నటరాజన్ ఔట్ చేయడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం లాంఛనమైంది.