
పుణే: ఐపీఎల్ 2022 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వైఫల్యం కొనసాగుతోంది. ప్రత్యర్థి, వేదిక, బ్యాటింగ్ పొజిషన్ మారినా.. విరాట్ ఆట మాత్రం మారడం లేదు. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ కోహ్లీ(9) విఫలమయ్యాడు. ఓపెనర్‌గా ప్రమోట్ చేసినా ఫామ్ అందుకోలేకపోయాడు. మరోసారి గోల్డెన్ డక్ ఔటయ్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు.
ట్రెంట్ బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ మూడో బంతిని విరాట్ ఫ్లిక్ చేయబోగా గాల్లోకి లేచిన బంతి.. షార్ట్ స్క్వెర్ లెగ్ ఫీల్డర్ డారిల్ మిచెల్ చేతిలో పడింది. అంతా కోహ్లీ ఔటనుకున్నారు. కానీ క్యాచ్ అందుకునే ముందు బంతి పిచ్ అవ్వడంతో కోహ్లీ ఊపిరి పీల్చుకున్నాడు. మిల్లీ మీటర్ దూరంలో మరో డకౌట్‌ను కోహ్లీ తప్పించుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన వరుస మ్యాచ్‌ల్లో కోహ్లీ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే.
ఇక బౌల్ట్ ఓవర్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదిన కోహ్లీ.. మరుసటి ఓవర్‌లో ప్రసిధ్ కృష్ణ వేసి బౌన్సర్‌కు బలయ్యాడు. ప్రసిధ్ నాలుగో బంతిని షార్ట్ పిచ్ బాల్‌గా సంధించగా.. సరిగ్గా అంచనా వేయలేకపోయిన కోహ్లీ తొందరగా షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. దాంతో బంతి బ్యాట్ బాటమ్ తాకి గాల్లోకి లేవగా రియాన్ పరాగ్ ఎలాంటి తప్పిదం చేయకుండా వెనుదిరిగాడు. దాంతో మరోసారి కోహ్లీ(10) నిరాశగా పెవిలియన్ చేరాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 144 పరుగులు చేసింది. రియాన్ పరాగ్(31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. హర్షల్ పటేల్ వేసిన చివరి ఓవర్‌లో రెండు సిక్స్‌లు, ఫోర్‌తో 18 పరుగులు పిండుకున్నాడు. రియాన్ పరాగ్ తర్వాత సంజూ శాంసన్(27) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆర్‌సీబీ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, వానిందు హసరంగ, హజెల్ వుడ్ రెండేసి వికెట్లు తీయగా.. హర్షల్ పటేల్ ఓ వికెట్ పడగొట్టాడు.