హైదరాబాద్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ సహనం కోల్పోయాడు. సహచర ఆటగాడిపై ఆగ్రహంతో ఊగిపోయాడు. కోపంలో నోరు జారిన సిరాజ్.. యువ ప్లేయర్‌ను బండ బూతులు తిట్టాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిరాజ్ హద్దులు ధాటాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ఓవర్ రెండో బంతికి ధృవ్ జురెల్ క్విక్ డబుల్ తీయగా.. సిరాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. డీప్ మిడ్ వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ప్లేయర్‌పై గట్టిగా అరించాడు. వేగంగా పరుగెత్తలేవా? అంటూ మండిపడ్డాడు. ఈ ఓవర్ ఐదో బంతిని జురెల్ భారీ సిక్స్ బాదడంతో సిరాజ్ ఫ్రస్టేషన్ డబుల్ అయ్యింది. చివరి బంతికి జురెల్..లాంగాన్ దిశగా ఆడి క్విక్ డబుల్ తీయగా.. బంతిని అందుకున్న లోమ్రోర్ వికెట్లకు దూరంగా విసరడంతో సిరాజ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.

గట్టిగా అరుస్తూనే వికెట్లను కొట్టేసిన అతను.. బంతి కంటే ముందే తన కాళ్లను తాకించాడు. దాంతో అశ్విన్ రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే బంతి సరిగ్గా వేయలేదని జురెల్‌పై సిరాజ్ నోరు పారేసుకున్నాడు. బండ బూతులు తిట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
చివరి ఓవర్‌లో హర్షల్ పటేల్ మ్యాజిక్ చేసి 20 పరుగులు డిఫెండ్ చేయడంతో ఆర్‌సీబీ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. రెండు బౌండరీలు బాదిన అశ్విన్ క్యాచ్ ఔటవ్వడంతో మ్యాచ్ ఆర్‌సీబీ వశమైంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్(39 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62), గ్లేన్ మ్యాక్స్‌వెల్(44 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ రెండేసి వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులే చేసి ఓటమిపాలైంది. దేవదత్ పడిక్కల్(34 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 52), యశస్వి జైస్వాల్(37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47) రాణించినా ఫలితం లేకపోయింది. ఆర్‌సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, డేవిడ్ విల్లే తలో వికెట్ తీసారు.