
షార్జా: గ్లేన్ మ్యాక్స్‌వెల్(33 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీకి దేవదత్ పడిక్కల్(38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40) క్లాస్ ఇన్నింగ్స్ తోడవడంతో పంజాబ్ కింగ్స్ ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 165 పరుగలు భారీ లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 164 పరుగులు చేసింది. మ్యాక్సీ, పడిక్కల్‌తో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ(24 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 25), ఏబీ డివిలియర్స్(18 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లతో 23) రాణించారు. పంజాబ్ బౌలర్లలో మహమ్మద్ షమీ(3/39), మోయిసెస్ హెన్రీక్స్(3/12) మూడేసి వికెట్లు తీశారు.
ఇక ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆర్‌సీబీకి ఓపెనర్లు దేవదత్ పడిక్కల్(40), విరాట్ కోహ్లీ(25) మంచి శుభారంభం అందించారు. ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగెత్తించారు. దాంతో పవర్ ప్లే ముగిసేసమయానికి ఆర్‌సీబీ వికెట్ నష్టపోకుండా 55 రన్స్ చేసింది. పవర్ ప్లే ముగిసిన వెంటనే స్పిన్నర్లను బరిలోకి దించిన కేఎల్ రాహుల్.. ఫలితం రాబట్టాడు. స్పిన్‌కు ఆర్‌సీబీ బ్యాట్స్‌మన్ తడబడటంతో పరుగుల వేగం తగ్గింది. ఈ క్రమంలోనే రవిబిష్ణోయ్ వేసిన 8వ ఓవర్ మూడో బంతికి పడిక్కల్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతిని అంచనా వేయడంలో పడిక్కల్ విఫలమయ్యాడు. దాంతో బంతి అతని బ్యాట్ మిస్సై కీపర్ రాహుల్ చేతిలో పడింది. పడిక్కల్ గ్లౌజ్‌కు తాకినట్లు అనిపించడంతో పాటు సౌండ్ రావడంతో పంజాబ్ ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేశారు.
కానీ ఫీల్డ్ అంపైర్ నాటౌటివ్వడంతో రాహుల్ రివ్యూ కోరాడు. అయితే రిప్లేలో బంతి గ్లౌవ్స్‌ను తాకినట్లు స్నీకో మీటర్‌లో స్పైక్స్ కనిపించినా థర్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. ఈ నిర్ణయంపై రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి కూడా దిగాడు. ఆ తర్వాత కూడా తమ తడబాటును కొనసాగించిన కోహ్లీ, పడిక్కల్ జోడీ పరుగులు తీయడానికి తెగకష్టపడింది. హర్‌ప్రీత్ బ్రార్ వేసిన 9వ ఓవర్‌లో కోహ్లీ సిక్స్ బాదినా.. హెన్రీక్స్ ఈ జోడీని విడదీశాడు. తన ఫస్ట్ ఓవర్‌లోనే వరుస బంతుల్లో కోహ్లీ, డానియల్ క్రిస్టియన్(0)ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి మ్యాక్స్‌వెల్ రాగా.. తన మరుసటి ఓవర్‌లోనే హెన్రీక్స్.. పడిక్కల్‌ను ఔట్ చేసి ఆర్‌సీబీని దెబ్బతీశాడు. దాంతో ఆర్‌సీబీ 73 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది.
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన ఏబీ డివిలియర్స్‌తో మ్యాక్సీ ధాటిగా ఆడాడు. రవిబిష్ణోయ్ వేసిన 15వ ఓవర్‌లో రెండు భారీ సిక్స్‌లు బాదిన మ్యాక్స్‌వెల్.. షమీ వేసిన 17వ ఓవర్‌లో బౌండరీ బాదాడు. ఇదే ఓవర్‌లో డివిలియర్స్ వరుసగా ఫోర్, సిక్స్ కొట్టడంతో ఆర్‌సీబీ స్కోర్ బోర్డు పరుగెత్తింది. రవి బిష్ణోయ్ వేసిన 18వ ఓవర్‌లో ఫోర్, సింగిల్ తీసిన మ్యాక్సీ.. 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక అర్షదీప్ సింగ్ వేసిన 19వ ఓవర్‌లో సిక్స్ బాదిన ఏబీడీ.. ఆ మరుసటి బంతికి రనౌటయ్యాడు. ఇక షమీ వేసిన చివరి ఓవర్‌లో మ్యాక్సీ, షబాజ్, గార్టన్ ఔటవ్వడంతో ఆర్‌సీబీ 164 పరుగులకే పరిమితమైంది.