అసలేం జరిగిందంటే..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు దేవదత్ పడిక్కల్(40), విరాట్ కోహ్లీ(25) మంచి శుభారంభం అందించారు. ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగెత్తించారు. దాంతో పవర్ ప్లే ముగిసేసమయానికి ఆర్‌సీబీ వికెట్ నష్టపోకుండా 55 రన్స్ చేసింది. పవర్ ప్లే ముగిసిన వెంటనే స్పిన్నర్లను బరిలోకి దించిన కేఎల్ రాహుల్.. ఆర్‌సీబీ బ్యాట్స్‌మన్ జోరును తగ్గించాడు. స్పిన్ బౌలింగ్ ఆడటంతో విరాట్- పడిక్కల్ తడబడ్డారు. ఈ క్రమంలోనే రవిబిష్ణోయ్ వేసిన 8వ ఓవర్ మూడో బంతికి పడిక్కల్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు.
అయితే బంతిని అంచనా వేయడంలో పడిక్కల్ విఫలమవడంతో బంతి మిస్సై కీపర్ రాహుల్ చేతిలో పడింది. పడిక్కల్ గ్లౌజ్‌కు తాకినట్లు అనిపించడంతో పాటు సౌండ్ రావడంతో పంజాబ్ ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేశారు.
స్నీకో మీటర్‌లో స్పైక్స్ ఉన్నా...
అయితే ఫీల్డ్ అంపైర్ అనంత పద్మనాభన్ నాటౌట్ ఇవ్వడంతో రాహుల్.. రివ్యూ కోరాడు. టీవీ రిప్లేలో పలు మార్లు పరిశీలించిన థర్డ్ అంపైర్ కే శ్రీనివాసన్ నాటౌట్‌గా తేల్చాడు. అయితే బంతి గ్లౌజ్‌ను ధాటే క్రమంలో స్నీకో మీటర్‌లో స్పైక్స్ కనిపించాయి. కానీ థర్డ్ అంపైర్ మాత్రం స్పైక్స్ పెద్దగా లేవని నాటౌట్ ఇచ్చాడు. దాంతో ఫీల్డ్ అంపైర్ కూడా అదే నిర్ణయాన్ని వెల్లడించాడు.
దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రాహుల్, ఇతర పంజాబ్ ఆటగాళ్లు.. అంపైర్ పద్మనాభన్‌తో వాగ్వాదానికి దిగారు. స్నికో మీటర్‌లో స్పైక్ కనిపించింది కదా? ఎందుకు నాటౌట్ ఇచ్చారని నిలదీశాడు. దీనికి అనంత పద్మనాభన్ సమాధానం చెప్పినా అతను సంతృప్తి చెందలేదు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా అతనితో కూడా ఈ విషయం మాట్లాడుతూ రాహుల్ అసహనం వ్యక్తం చేశాడు.
అంపైర్ తప్పిదం..
ఇది థర్డ్ అంపైర్ ఘోర తప్పిదమని క్రికెట్ విశ్లేషకులతో పాటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు. అంత స్పష్టంగా స్పైక్స్ కనిపిస్తున్నా.. నాటౌట్ ఎలా ఇచ్చారని నిలదీస్తున్నారు. మరోసారి అంపైర్ తప్పిదంతో పంజాబ్ మూల్యం చెల్లించుకుంటుందని కామెంట్ చేస్తున్నారు. ఇక రవిబిష్ణోయ్‌కి వికెట్ దక్కకుండా పోయిందని ఈ వికెట్‌కు సంబంధించిన ఫొటోలను వీడియోలను షేర్ చేస్తున్నారు. అంపైర్ తప్పిదం కారణంగా పంజాబ్ రివ్యూ కూడా కోల్పోయిందని, ఇది అన్యాయమని కామెంట్ చేస్తున్నారు.

వరుసగా రెండు వికెట్లు..
ఇక స్పిన్‌కు తీవ్రంగా తడబడిన కోహ్లీ, పడిక్కల్ జోడీ పరుగులు తీయడానికి తెగకష్టపడింది. హర్‌ప్రీత్ బ్రార్ వేసిన 9వ ఓవర్‌లో కోహ్లీ సిక్స్ బాదినా.. హెన్రీక్స్ వీరి జోరుకు బ్రేక్ వేశాడు. తన ఫస్ట్ ఓవర్‌లోనే వరుస బంతుల్లో కోహ్లీ, డానియల్ క్రిస్టియన్(0)ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి మ్యాక్స్‌వెల్ రాగా.. తన మరుసటి ఓవర్‌లోనే హెన్రీక్స్.. పడిక్కల్‌ను ఔట్ చేసి ఆర్‌సీబీని దెబ్బతీశాడు. దాంతో ఆర్‌సీబీ 73 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి ఏబీ డివిలియర్స్ రాగా.. మ్యాక్సీ ధాటిగా ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. 13 ఓవర్లు ముగిసే సరికి ఆర్‌సీబీ 3 వికెట్లకు 89 పరుగులు చేసింది.


Click it and Unblock the Notifications
