ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జరుగుతున్న ఫైనల్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. నా మనస్సు, శరీరానికి సానుకూల సంకేతాలు మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాను. ఇది అద్భుతమైన రోజు. ప్రేక్షకులు మమ్మల్ని ఉత్తేజపరుస్తున్నారు. మేం చేయాల్సిందల్లా ఇక్కడికి వచ్చి ఈ క్షణాన్ని ఆస్వాదించడమే.
కుర్రాళ్ళు ఉత్సాహంగా, సానుకూల దృక్పథంతో ఉన్నారు. టీమ్ మీటింగ్‌లో ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిదని చెప్పాం. ఫైనల్ కాబట్టి టెన్షన్ బాగానే ఉంటుంది. ఇది కేవలం మరో మ్యాచ్ అని నేను చెప్పను. ఇది ఫైనల్. ఫైనల్‌లానే ఆడుతాం. ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నాం'అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకోవాలనుకున్నామని ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ తెలిపాడు. 'మేం కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. పిచ్ చూడటానికి చాలా కఠినంగా కనిపిస్తోంది. మేం భారీ లక్ష్యాన్ని నమోదు చేసే ప్రయత్నం చేస్తాం. పంజాబ్‌ను ఒత్తిడిలో పెడ్తాం. ఇప్పటి వరకు మేం మంచి క్రికెట్ ఆడాం. ఇది మాకు మరో మ్యాచ్ మాత్రమే. ఇది ఫైనల్. కానీ మరో మ్యాచ్‌లానే భావిస్తాం. విన్నింగ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నాం. ఎలాంటి మార్పులు లేవు. రెడ్, బ్లాక్ సాయిల్‌తో కలిపి ఈ పిచ్ చేశారు. బౌలింగ్, బ్యాటింగ్‌కు సమంగా ఉండనుంది.'అని రజత్ పటీదార్ చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
ఆర్‌సీబీ: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్.
పంజాబ్ కింగ్స్ : ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, కైల్ జెమీసన్, విజయ్‌కుమార్ వైశాఖ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.