
నాలుగు ఓవర్లు.. 12 పరుగులు:
వాషింగ్టన్ సుందర్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఒక వికెట్ తీసి కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దాంతో ఎకానమీ రేటు పరంగా టీమిండియా మాజీ కెప్టెన్, స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే సరసన చేరాడు. 2009లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ స్పిన్నర్‌గా జంబో రెండు వికెట్లు తీసి.. 12 పరుగులు ఇచ్చాడు. ఫలింతగా ఎకానమీ రేటు 3.00గా నమోదైంది. ఇప్పుడు అదే ఎకానమీ గణాంకాలను సుందర్ నమోదు చేశాడు. దాంతో కుంబ్లే సరసన సుందర్ నిలిచాడు. పవర్ ప్లేలో సుందర్ 3 ఓవర్లలో 7 పరుగులిచ్చి వికెట్ తీశాడు.

చహల్@1:
బెంగళూరు తరఫున ఒక స్పిన్నర్‌గా అత్యుత్తమ ఎకానమీ నమోదు చేసిన జాబితాలో టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజువేంద్ర చహల్ 1.50 ఎకానమీ రేటుతో తొలి స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్ స్పిన్నర్ శామ్యూల్స్ బద్రీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 2019లో సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో చహల్ తన నాలుగు ఓవర్ల కోటాలో 6 పరుగులే ఇచ్చి అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయగా.. 2017లో ముంబైతో మ్యాచ్‌లో బద్రీ 9 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. బద్రీ ఎకానమీ రేటు 2.25గా ఉంది. బద్రీ తర్వాత స్థానంలో కుంబ్లే, సుందర్‌లు ఉన్నారు.

ఏబీ వీర బాదుడు:
తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరుకు ఆరోన్ ఫించ్ (35 బంతుల్లో 52 పరుగులు), దేవదూత్ పడిక్కల్ (40 బంతుల్లో 54 పరుగులు) అర్ధ సెంచరీలు సాధించి మంచి ఆరంభాన్నిచ్చారు. అనంతరం ఏబీ డివిలియర్స్ (24 బంతుల్లో 55 పరుగులు) వీర బాదుడుతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. చివరలో శివమ్ దూబే (10 బంతుల్లో 27 పరుగులు) 3 సిక్సులతో రాణించడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగుల భారీ స్కోరు చేసింది. ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీశాడు.

సైనీ సూపర్ బౌలింగ్:
అనంతరం చేధనకు దిగిన ముంబై ఇండియన్స్ ఓపెనర్లు రోహిత్ శర్మ, క్వింటన్ డీకాక్‌లతో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా వెంటవెంటనే అవుట్ కావడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఇషాన్ కిషన్ (58 బంతుల్లో 99 పరుగులు) భారీ ఇన్నింగ్స్‌కు తోడు కీరన్ పొలార్డ్ (24 బంతుల్లో 60 పరుగులు) హిట్టింగ్ తోడవడంతో మ్యాచ్ టైగా ముగిసింది. సూపర్ ఓవర్‌లో ఆర్సీబీ బౌలర్ నవదీప్ సైనీ అద్భుతమైన బౌలింగ్తో ముంబై 7 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీని డివిలియర్స్ రెండు ఫోర్లు కొట్టి గెలిపించాడు.


Click it and Unblock the Notifications

అందుకే ఇషాన్ కిషాన్‌ను సూపర్ ఓవర్ ఆడించలేదు: రోహిత్ శర్మ










