బెంగళూరు: ఐపీఎల్ 2023 సీజన్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఘన విజయంతో ప్రారంభించింది. నాలుగేళ్ల తర్వాత సొంతమైదానంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ( 49 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 82 నాటౌట్ ), కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(43 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 73) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో మ్యాచ్ వన్‌సైడ్‌గా మారింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. తెలుగు తేజం తిలక్ వర్మ( 46 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 84 నాటౌట్) అసాధారణ పోరాటంతో రాణించగా.. నెహాల్ వాదెర(13 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 21) అండగా నిలిచాడు. ఆర్‌సీబీ బౌలర్లలో కర్ణ్ శర్మ రెండు వికెట్లు తీయగా.. సిరాజ్, టోప్లీ, ఆకాశ్ దీప్, హర్షల్ పటేల్, మైఖేల్ బ్రేస్‌వెల్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ 16.2 ఓవర్లలోనే 2 వికెట్లకు 172 పరుగులు చేసి 22 బంతులుండగానే సునాయస విజయాన్నందుకుంది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ తొలి వికెట్‌కు 148 పరుగుల జోడించారు. అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో డుప్లెసిస్ ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్(0) కూడా డకౌటయ్యాడు. గ్లేమ్ మ్యాక్స్‌వెల్(3 బంతుల్లో 2 సిక్స్‌లతో 12 నాటౌట్) సాయంతో కింగ్ కోహ్లీ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. భారీ సిక్సర్‌తో విరాట్ మ్యాచ్‌ను ముగించడం గమనార్హం. ముంబై ఇండియన్స్ బౌలర్లలో కామెరూన్ గ్రీన్, అర్షద్ ఖాన్ తలో వికెట్ తీసారు.
ఇన్నింగ్స్ ఆరంభంలో విరాట్ కోహ్లీ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను జోఫ్రా ఆర్చర్ నేలపాలు చేయడం ముంబై ఇండియన్స్ కొంపముంచింది. ఆ క్యాచ్ పట్టుంటే మ్యాచ్ హోరాహోరీగా సాగండేది. ముంబై ఇండియన్స్ ఓటమి ప్రధాన కారణం మాత్రం బ్యాటింగ్ వైఫల్యమే. తిలక్ వర్మ మినహా మరే బ్యాటర్ రాణించకపోవడంతో ముంబై సాధారణ స్కోర్‌కే పరిమితమైంది. డ్యూ ప్రభావం అతిగా ఉన్న బెంగళూరులో 200 ప్లస్ లక్ష్యాన్ని కాపాడుకోవడం కూడా కష్టమే. ఇక వరుసగా 11వ సీజన్‌లోనూ ముంబై శుభారంభం చేయలేకపోయింది. 2013 సీజన్ నుంచి ముంబై తొలి మ్యాచ్‌లో గెలవడం లేదు.