బెంగళూరు: ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. డ్యూ ప్రభావం నేపథ్యంలోనే చేజింగ్‌కు మొగ్గు చూపానని ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు. తనతో పాటు బ్రేస్‌వెల్, మ్యాక్స్‌వెల్, టోప్లీ విదేశీ ఆటగాళ్లుగా బరిలోకి దిగుతున్నారని చెప్పాడు. చాలా రోజుల తర్వాత తమ ఫ్రాంచైజీ హోమ్ గ్రౌండ్‌లో ఆడుతుండటం ఉత్సాహంగా ఉందన్నాడు. తమ ప్రథమ లక్ష్యం ప్లే ఆఫ్స్ చేరడమని చెప్పిన ఫాఫ్ డుప్లెసిస్.. శుభారంభంతోనే టీమ్ టార్గెట్ దిశగా ముందుకు సాగుతామని ధీమా వ్యక్తం చేశాడు.
మరోవైపు టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకునేవాడినని ముంబై సారథి రోహిత్ శర్మ తెలిపాడు. కొత్త రూల్స్ నేపథ్యంలో జట్లన్నీ చేజింగ్‌కు మొగ్గు చూపుతున్నాయని, ఏది ఏమైనా గుడ్ క్రికెట్ ఆడితేనే విజయం దక్కుతుందని తెలిపాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని, సానుకూల దృక్పథంతో బరిలోకి దిగుతున్నామని తెలిపాడు. టీమ్ డేవిడ్, కామెరూన్ గ్రీన్, జోఫ్రా ఆర్చర్, జాసన్ బెహండార్ఫ్‌లు ఓవర్‌సీస్ ఆటగాళ్లుగా ఆడుతున్నారని పేర్కొన్నాడు.

గత సీజన్‌లో తాము తీవ్రంగా నిరాశపరిచామని, ఆ వైఫల్యానికి ఈ సారి బదులు తీర్చుకుంటామని రోహిత్ స్పష్టం చేశాడు. జట్టులోకి కొత్త ఆటగాళ్లు వచ్చారని, వాళ్లు సత్తా చాటుతారని ఆశాభావం వ్యక్తం చేశాడు. కెప్టెన్‌గా 200 టీ20 మ్యాచ్ ఆడటం తనకు దక్కిన గొప్ప గౌరవమని రోహిత్ తెలిపాడు. ఇదో సుదీర్ఘ ప్రయాణమని, చాలా సంతోషంగా ఉందన్నాడు. ఇలానే మరిన్ని మ్యాచ్‌లు ఆడి జట్టు కోరుకున్న మైలు రాళ్లను అందుకుంటానని తెలిపాడు.
తుది జట్లు:
ఆర్‌సీబీ: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), గ్లేన్ మ్యాక్స్‌వెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, షెహ్‌బాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్(కీపర్), కరణ్ శర్మ, హర్షల్ పటేల్, ఆకాశ్ దీప్, రీస్ టోప్లీ, మహమ్మద్ సిరాజ్
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, కామెరూన్ గ్రీన్, తిలక్ వర్మ, టీమ్ డేవిడ్, నెహల్ వాదెహ్రా, హృతిక్ షోకీన్, పియూష్ చావ్లా, జోఫ్రా ఆర్చర్, అర్షద్ ఖాన్