ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 182 పరుగుల లక్ష్యాన్ని నమోదు చేసింది. క్వింటన్ డికాక్(56 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 81) విధ్వంసకర బ్యాటింగ్‌తో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులు చేసింది. చివర్లో నికోలస్ పూరన్(21 బంతుల్లో ఫోర్, 5 సిక్స్‌లతో 40 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.
ఆర్‌సీబీ బౌలర్లలో గ్లేన్ మ్యాక్స్‌వెల్ రెండు వికెట్లు తీయగా..టోప్లీ, యశ్ దయాల్, సిరాజ్ తలో వికెట్ తీసారు. ఆర్‌సీబీ బౌలర్ల పేలవ బౌలింగ్, చెత్త ఫీల్డింగ్ లక్నో సూపర్ జెయింట్స్‌కు కలిసొచ్చింది.

సూపర్ స్టార్ట్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌కు ఓపెనర్లు క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి ఓవర్ నుంచే డికాక్ దూకుడుగా ఆడాడు. సిరాజ్ బౌలింగ్‌లో వరుస సిక్స్‌లతో విరుచుకు పడ్డాడు. రాహుల్ సైతం హిట్టింగ్ స్టార్ట్ చేయడంతో లక్నో 5.2 ఓవర్లలోనే 53 పరుగులు చేసింది.
పవర్ ప్లే అనంతరం రంగంలోకి దిగిన మ్యాక్స్‌వెల్ కేఎల్ రాహుల్(20)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. టోప్లీ బౌలింగ్‌లో 34 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద డికాక్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను మ్యాక్సీ అందుకోలేకపోయాడు. ఈ అవకాశంతో అతను చెలరేగాడు. క్రీజులోకి వచ్చిన పడిక్కల్(6)ను సిరాజ్.. కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు.
డికాక్ విధ్వంసం..
ఇక మార్కస్ స్టోయినీస్‌తో కలిసి డికాక్ ధాటిగా ఆడాడు. 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మార్కస్ స్టోయినీస్(24)ను మ్యాక్స్‌వెల్ పెవిలియన్ చేర్చగా.. దూకుడుగా ఆడుతూ సెంచరీ దిశగా సాగిన డికాక్‌ను టోప్లీ ఔట్ చేశాడు. 3 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నికోలస్ పూరన్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను వికెట్ కీపర్ అనూజ్ రావత్ వదిలేసాడు.
ఈ అవకాశంతో చెలరేగిన పూరన్.. భారీ సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. ఆయుష్ బదోని(0)ని యశ్ దయాల్ ఔట్ చేసినా.. కృనాల్ పాండ్యాతో కలిసి చెలరేగాడు. టోప్లీ, సిరాజ్ బౌలింగ్‌లో భారీ సిక్స్‌లతో లక్నోకు పోరాడే లక్ష్యాన్ని అందించాడు.