బెంగళూరు: ఐపీఎల్ 2023 సీజన్‌లో లక్నోసూపర్ జెయింట్స్ థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో లక్నో ఒక్క వికెట్ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఆర్‌సీబీ టాప్-3 బ్యాటర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్(44 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 79 నాటౌట్), గ్లేన్ మ్యాక్స్‌వెల్(29 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. లక్నో బౌలర్లలో అమిత్ మిశ్రా, మార్క్ వుడ్ తలో వికెట్ తీయగా.. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 213 పరుగులు చేసి గెలుపొందింది. మార్కస్ స్టోయినిస్(30 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 65), నికోలస్ పూరన్(19 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 62) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఆఖరి బంతికి ఒక్క పరుగు చేయాల్సిన పరిస్థితుల్లో ఆర్‌సీబీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తప్పిదం.. లక్నోకు కలిసొచ్చింది.
బ్యాట్‌కు బంతి తగలకపోయినా.. పరుగు కోసం ఆవేశ్ ఖాన్ పరుగెత్తగా.. బంతిని కలెక్ట్ చేసి రనౌట్ చేయడంలో దినేశ్ కార్తీక్ విఫలమయ్యాడు.

సిరాజ్ మెరిసినా..
213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. సిరాజ్ దెబ్బకు లక్నో పరుగుల ఖాతా తెరవకుండానే డేంజరస్ కైల్ మేయర్స్(0) వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే పార్నెల్ బౌలింగ్‌లో దీపక్ హుడా(9), కృనాల్ పాండ్యా(0) కీపర్ క్యాచ్‌గా ఔటయ్యారు.
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టోయినిస్.. సిరాజ్ తప్పిదంతో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పుకున్నాడు. 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్టోయినీస్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను సిరాజ్ అందుకోలేకపోయాడు.ఈ అవకాశంతో స్టోయినీస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

స్టోయినీస్ విధ్వంసం..
హర్షల్ పటేల్ బౌలింగ్‌లో 6, 4, 4.. కర్ణ్ శర్మ ఓవర్‌లో రెండు ఫోర్లు ఓ సిక్సర్ బాదాడు. షెహ్‌బాజ్ అహ్మద్ వేసిన మరుసటి ఓవర్‌లో రెండు సిక్స్‌లు బాది 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్టోయినీస్ జోరుకు కర్ణ్ శర్మ క్యాచ్ ఔట్‌తో బ్రేక్ వేయగా.. నాలుగో వికెట్‌కు నమోదైన 76 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఆ వెంటనే కేఎల్ రాహుల్‌ను సిరాజ్ ఔట్ చేయడంతో మ్యాచ్ ఆర్‌సీబీ వైపు మళ్లినట్లు అనిపించింది. కానీ క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. ఎదుర్కొన్న రెండో బంతికే సిక్సర్ బాదిన పూరన్.. భారీ షాట్లతో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసకొని ఈ సీజన్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ అందుకున్నాడు.
ఉత్కంఠగా..
హాఫ్ సెంచరీ అనంతరం కూడా అదే జోరు కనబర్చగా.. సిరాజ్ 17వ ఓవర్‌లో డేంజరస్ పూరన్‌ను ఔట్ చేసి 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు.చివరి 18 బంతుల్లో లక్నో విజయానికి 24 పరుగులు అవసరమవ్వగా.. హర్షల్ పటేల్ 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. పార్నెల్ వేసిన 19వ ఓవర్‌లో ఆయుష్ బదోని ఫోర్, సిక్స్ బాది హిట్ వికెట్ అయ్యాడు.
సిక్స్ కొట్టే క్రమంలో బ్యాట్ వికెట్లను తాకడంతో వెనుదిరిగాడు. దాంతో చివరి ఓవర్‌లో లక్నో విజయానికి 6 పరుగులే అవసరమవ్వగా.. హర్షల్ పటేల్.. మార్క్ వుడ్‌ను క్లీన్ బౌల్డ్ చేసి ఆశలు రేకెత్తించాడు. అయితే రవి బిష్ణోయ్ క్విక్ డబుల్‌తో పాటు సింగిల్ తీసి మ్యాచ్‌ను టై చేశాడు. 2 బంతుల్లో ఒక్క పరుగు చేయాల్సిన సమయంలో ఉనద్కత్ క్యాచ్ ఔటవ్వడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ఆవేశ్ ఖాన్ క్రీజులోకి రాగా.. ఆఖరి బంతికి బై రూపంలో పరుగు తీసిన లక్నో విజయాన్నందుకుంది.