ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతున్నాడు. తనకే సాధ్యమైన ట్రేడ్ మార్క్ షాట్స్‌తో అభిమానులను అలరిస్తున్నాడు. ముఖ్యంగా కేకేఆర్ హయ్యెస్ట్ ప్రైజ్ ట్యాగ్ ప్లేయర్, ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ కొట్టిన ఓ సిక్సర్.. ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ బాదిన ఈ ఫ్లిక్ షాట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ట్రేడ్ మార్క్ సిక్సర్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మిచెల్ స్టార్క్ వేసిన మూడో ఓవర్‌లో కోహ్లీ ఈ సిక్సర్ బాదాడు. లెగ్ స్టంప్ మీదుగా మిచెల్ స్టార్క్ వేసిన స్లోయర్ బాల్‌ను విరాట్ కోహ్లీ ఫ్లిక్ షాట్‌తో ఓవర్ డీప్ స్క్వేర్ లెగ్ దిశగా సిక్సర్ తరలించాడు.

ఈ షాట్‌కు మిచెల్ స్టార్క్ సైతం బిత్తరపోయాడు. వావ్ అంటూ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. ఇలాంటి షాట్స్ విరాట్ కోహ్లీకే సాధ్యమని అతని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. వారెవ్వా వాటే షాట్.. అని కొనియాడుతున్నారు. ఇలాంటి షాట్స్ కోసమే కోహ్లీ బ్యాటింగ్‌ను ఇష్టపడుతామని కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. హర్షిత్ రాణా వేసిన రెండో ఓవర్‌లో సిక్సర్ బాది జోరు కనబర్చిన ఫాఫ్ డుప్లెసిస్.. మరుసటి బంతికే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్‌తో కలిసి కోహ్లీ ధాటిగా ఆడాడు. గ్రీన్ కూడా దూకుడుగా ఆడటంతో ఆర్‌సీబీ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది.
రస్సెల్ బౌలింగ్‌లో కామెరూన్ గ్రీన్(33) ఔటైనా.. మ్యాక్స్‌వెల్ సాయంతో కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చక్రవర్తీ బౌలింగ్‌లో మరో సిక్సర్ బాదిన కోహ్లీ.. ఆర్‌సీబీ తరఫున అత్యధిక సిక్స్‌లు బాదిన ప్లేయర్‌గా అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ క్రమంలో క్రిస్ గేల్‌ను కోహ్లీ అధిగమించాడు. ఇప్పటి వరకు కోహ్లీ.. ఆర్‌సీబీ తరఫున 240 సిక్స్‌లు బాదగా.. క్రిస్ గేల్(239), ఏబీ డివిలియర్స్(238) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.